బాబు ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం
మదనపల్లె రూరల్ : చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే)పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీయం.శివప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక వీసీకే కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వాద్దానాలను తుంగలో తొక్కి ఎస్సీ,ఎస్టీలకు ద్రోహం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు...వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీలకు రక్షణ కరువైందని, హత్యలు జరుగుతున్నాయని, తప్పుడు కేసులు నమోదుచేశారని, సంక్షేమం గాలికి వదిలేసిందని, నిధులు పూర్తిగా ఆపేసి, ఉపాధి అవకాశాలు దూరం చేసిందని, విద్యార్థుల మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచకుండా పేదవిద్యార్థుల పొట్ట కొట్టిందని నానాయాగీ చేశారన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించి, అనేక పథకాలు రద్దుచేశారని తెగ బాధపడిపోయారన్నారు. టీడీపీ నాయకుల మాయమాటలు నమ్మి 2024లో ఎస్సీ,ఎస్టీలు బేషరుతగా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే, ఏరుదాటాక తెప్పతగలేసిన చందంగా ఎస్సీ,ఎస్టీలపై నిర్లక్ష్యం కనపరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ,ఎస్టీలకు ఇచ్చిన హామీల అమలుకు అనుగుణంగా రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, లేకుంటే కూటమిపార్టీలు తమ ఆగ్రహానికి గురికాక తప్పదని శివప్రసాద్ హెచ్చరించారు. కార్యక్రమంలో వీసీకే పార్టీ పట్టణ అధ్యక్షులు బురుజు రెడ్డిప్రసాద్, స్థానిక నాయకులు సొన్నికంటిరెడ్డెప్ప, జీ.వి.రమణ, బండకోట రవి, రవిశంకర్, రాయల్ సూరి తదితరులు పాల్గొన్నారు.


