వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. మదనపల్లి మండలం సీటీఎం పంచాయతీ చిన్నాయని చెరువు పల్లెకు చెందిన కూలీ రెడ్డన్న (56) గురువారం సీటీఎం రైల్వే గేట్ సమీపంలోని కల్యాణమండపం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రూయాకు రిఫర్ చేశారు. పెద్దమండెం మండలం ఎల్లుట్ల చీలమాకులపల్లికి చెందిన వినోద్, కవితలు గురువారం సంక్రాంతి సందర్భంగా ద్విచక్ర వాహనంలో తిరుపతి నుంచి స్వగ్రామానికి వస్తుండగా, తురకపల్లె సమీపంలో మరో బైక్ వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కవిత పరిస్థితి విషమంగా ఉండటంతో రుయాకు రెఫర్ చేశారు.కురబలకోట మండలం ముదివేడు యనమాలవారిపల్లికి చెందిన దంపతులు మధు(30) మాధవి(25) మదనపల్లెకు సొంత పనిపై వచ్చి, తిరిగి స్వగ్రామానికి స్కూటర్‌పై వెళ్తుండగా, మార్గమధ్యంలోని అంగళ్లు రైల్వే ఫ్లైఓవర్ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి పడి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మధు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. మదనపల్లె పట్టణం రామారావు కాలనీకి చెందిన దంపతులు గంగరాజు(31), దాత్రి (26) కర్ణాటక రాయల్పాడులోని ఆలయానికి బైక్ లో వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో బైక్ అదుపు తప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.


