
రాంగ్ రూట్‌లో వచ్చి లారీని ఢీకొన్న కారు
● తప్పిన పెను ప్రమాదం
● మద్యం మత్తులో కారులోని యువకులు
పుల్లంపేట : ముగ్గురు యువకులు మద్యం తాగి కారులో రాంగ్ రూట్‌లో వచ్చి.. లారీని ఢీకొనడంతో.. లారీ వెనుక వైపున నాలుగు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. టిప్పర్ డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో.. రెండు కార్లలో ఉన్న పది మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి ముగ్గురు యువకులు మద్యం తాగి కారులో రాజంపేట నుంచి రైల్వేకోడూరు వైపు వెళ్తూ ఉడుమువారిపల్లి సమీపంలోకి రాగానే రాంగ్ రూట్‌లో ఎదురుగా ఉన్న లారీని ఢీకొన్నారు. ముందుగానే పసిగట్టిన లారీ డ్రైవర్ బ్రేక్ వేయడంతో.. కారు పాక్షికంగా దెబ్బతింది. కారులో ఉన్న ముగ్గురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయిలే లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుకవైపున లారీతోపాటు రెండు కార్లు వస్తున్నాయి. అదే సమయంలో వాటి వెనుకే ముగ్గురాయితో మంగంపేట నుంచి కడపకు వెళ్తున్న టిప్పర్ ప్రమాదాన్ని పసిగట్టి పక్కకు తిప్పడంతో కారు వెనుకవైపు ఓ పక్క ఢీకొంది. దీంతో రెండు కార్లలో ఉన్న పది మంది సురక్షితంగా బయటపడ్డారు. టిప్పర్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రెండు కార్లు పాక్షికంగా మాత్రమే దెబ్బతిన్నాయి. ఒక కారులో అయితే ఇద్దరు, తల్లిదండ్రులతోపాటు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి మద్యం మత్తులో ఉన్న యువకులను పోలీసు స్టేషన్‌కు తరలించారు.