
జిల్లాలో కొత్త రైల్వే లైన్
గూడ్స్ రైళ్ల రద్దీ
● మూడో ట్రాక్ నిర్మాణానికి సన్నద్ధం
● గుంతకల్ నుంచి ఓబులవారిపల్లె దాకా..
● బొగ్గు గూడ్స్ రైళ్లకే పరిమితం
● జిందాల్ సహకారంతో ఏర్పాటు
రాజంపేట : ఉమ్మడి వైఎస్‌ఆర్ కడప జిల్లాలో కొత్తగా మూడో ట్రాక్ నిర్మాణానికి రైల్వేశాఖ సన్నద్ధమవుతోంది. ముంబయి–చైన్నె కారిడార్ మార్గంలో గుంతకల్లు నుంచి ఓబులవారిపల్లె వరకు ఈ లైను నిర్మించనున్నారు. ఇప్పటికే గుత్తి–రేణిగుంట మధ్య డబ్లింగ్(డబుల్ లైను ట్రాక్) ఉన్న సంగతి విదితమే. సిమెంటు, బొగ్గు, ఐరన్‌తోపాటు ఇతర సరుకుల రవాణా అధికంగా ఉంటుంది. దీంతో జిందాల్ సంస్థ సహకారంతో మూడో లైన్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే డీపీఆర్ (డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు) పూర్తయింది.
గూడ్స్ రైళ్ల రాకపోకల కోసమే..
మూడో లైను ట్రాక్ నిర్మితం కేవలం గూడ్స్‌రైళ్ల నిర్వహణకు కేటాయించే విధంగా కొనసాగించనున్నారు. అది కూడా జిందాల్ సంస్థకు బొగ్గు రవాణాను దృష్టిలో ఉంచుకొని.. ఈ లైను నిర్మాణానికి దారి తీసింది. జిందాల్ ఫ్యాక్టరీకి వెళ్లే గూడ్స్ రైళ్లకు ఈ ట్రాక్‌ను వినియోగించుకుంటారనే సమాచారం రైల్వే వర్గాల నుంచి వినిపిస్తోంది. 90 శాతం మేరకు జిందాల్ సంస్థకు రాకపోకలు సాగించే గూడ్స్ రైళ్లే నడవనున్నాయి. జిందాల్ సంస్థ, రైల్వే 50ః50 శాతం భాగస్వామ్యంతో ఈ లైను నిర్మాణం చేపట్టనున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. గడువు ముగిసిన తర్వాత థర్డ్‌లైను రైల్వేకి ఇచ్చే విధంగా విధానం కొనసాగుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్లలో థర్డ్‌లైను నిర్మాణం పూర్తి చేసేందుకు అటు జిందాల్, ఇటు రైల్వే యుద్ధప్రాతిపదకన చర్యలు తీసుకుంటున్నాయి.
ఓబులవారిపల్లె జంక్షన్ వరకే...
కృష్ణపట్నం పోర్టు నుంచి ఓబులవారిపల్లె జంక్షన్ వరకు ఉన్న రైలుమార్గం దాకా థర్డ్‌లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. గుత్తి–రేణిగుంట మధ్య ఫోర్‌లైన్ ట్రాక్స్ నిర్మాణానికి రైల్వేశాఖ సన్నద్ధమైంది. మొదటి విడత ప్రాధాన్యతగా గుంతకల్లు–ఓబులవారిపల్లె జంక్షన్ వరకు థర్డ్‌లైను ట్రాక్ వేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
భూసేకరణ.. సరిహద్దులపై దృష్టి
థర్డ్‌లైన్ నిర్మితానికి అవసరమయ్యే భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. 3, 4 లైనుకు సంబంధించిన అవసరమైన భూసేకరణ, రైల్వే స్థల సరిహద్దులపై దృష్టి సారించారు. నందలూరు రైల్వేకేంద్రం మినహాయించి అన్ని స్టేషన్‌లలో.. అదనంగా 3, 4 రైల్వేట్రాక్ వేయాల్సి ఉంటుంది.
చెయ్యేరు నదిపై బ్రిడ్జి
నందలూరు చెయ్యేరు నదిపై థర్డ్ లైను నిర్మాణానికి అవసరమయ్యే బ్రిడ్జి నిర్మితం చేయడానికి సర్వే పూర్తయింది. బ్రిటీషర్ల హయాంలో ఏర్పాటైన బ్రిడ్జి స్థానంలో మూడవ బ్రిడ్జి నిర్మితం చేయనున్నారు. అయితే 3, 4 లైనుకు సరిపడే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు.
రేణిగుంట–ఓబులవారిపల్లె..
రేణిగుంట–ఓబులవారిపల్లె (56 కి.మీ) మధ్య కూడా మూడవ, నాల్గవ లైను నిర్మితం చేయాల్సి వుంటుంది. అయితే ఓబులవారిపల్లె వరకు థర్డ్‌లైను నిర్మాణం పూర్తి చేయనున్నారు. కృష్ణపట్నం పోర్టుకు గూడ్స్ రైళ్ల రాకపోకలను సకాలంలో నిర్వహించేందుకే.. ముందుగా ఽథర్డ్‌లైను నిర్మితంపై దృష్టి సారించారు.
గూడ్స్‌రైళ్ల రద్దీ అధికంగా కొనసాగుతోంది. గుంతకల్ టు వయా ఓబులవారిపల్లె మీదుగా కృష్ణపట్నం పోర్టుకు లోడింగ్, అన్‌లోడింగ్‌తో కలుపుకొని 40 గూడ్స్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఉన్న డబ్లింగ్‌లో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లతోపాటు ఇతర గూడ్స్ రైళ్ల ట్రాఫిక్‌తో.. కృష్టపట్నం పోర్టు గూడ్స్ రైళ్లు గమ్యాలకు చేరడంలో ఆలస్యం అవుతోంది. నందలూరు రన్నింగ్‌స్టాప్ క్రూసెంటర్ కేంద్రంగా ఈ గూడ్స్‌రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రైల్వేబోర్డు నందలూరు క్రూసెంటర్‌ను బలోపేతం చేసే దిశగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే.

జిల్లాలో కొత్త రైల్వే లైన్

జిల్లాలో కొత్త రైల్వే లైన్