అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Oct 8 2025 10:00 AM | Updated on Oct 8 2025 10:00 AM

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

సీపీడబ్ల్యూ స్కీమ్‌లకు విద్యుత్‌ సౌకర్యం

తాగునీటి కోసం కొత్త బోర్ల ఏర్పాటు

జెడ్పీ చైర్మన్‌ ముత్యాల రామగోవింద రెడ్డి

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలో చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముత్యాల రామగోవింద రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ బద్వేలు, గోపవరం, పోరుమామిళ్ల, బ్రహ్మంగారిమఠం మండలాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచి నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాలని చెప్పారు. వేంపల్లె షాపింగ్‌ కాంప్లెక్స్‌కు మరమ్మత్తులు నిర్వహించాలని ఆదేశించారు. చక్రాయపేటలోని సీపీడబ్ల్యూ స్కీమ్‌ మోటారు కాలిపోవడంపై ఆయన ఆరా తీశారు. ఎర్రగుడి సీపీ డబ్ల్యూ స్కీమ్‌కు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ వచ్చేవరకు అద్దె ట్రాన్స్‌ఫార్మర్‌ వినియోగించాలని సూచించారు. గండిక్షేత్రంలో వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి తొలుత రూ. 25 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలవాలన్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు, చక్రాయపేట మండలాల్లో భూగర్బ జలాలు అడుగంటాయన్నారు.ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా అవసరమైన చోట్ల కొత్త బోర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. టెండర్లు నామినేషన్లపై ఇస్తున్నారంటూ ఆడిట్‌ అధికారి తెలిపారు.

వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ బిల్లులే రాకపోతే టెండర్లు వేసేందుకు ఎవరు ముందుకు వస్తారంటూ ప్రశ్నించారు. ఏవైనా పనులకు టెండర్లు పిలువాలంటే ముందుగా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని జెడ్పీ చైర్మన్‌ సూచించారు.

అర్హత లేని వారికి పెన్షన్లు ఇచ్చారని, ఇప్పుడు వాటిని తొలగిస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని పులివెందుల జెడ్పీటీసీ అన్నారు. దీనిపై జెడ్పీ చైర్మన్‌ స్పందిస్తూ అనర్హులకు ఇవ్వడాన్ని తాము కూడా వ్యతిరేకమేనన్నారు. ఒకరికి అర్హత లేదని ఒక డాక్టర్‌ సర్టిఫై చేసిన తర్వాత అతను అప్పీలుకు వెళితే మరో డాక్టర్‌ అర్హత ఉన్నట్లుగా సర్టిఫికెట్‌ ఇస్తున్నారని పేర్కొన్నారు. అప్పుడు ఏ డాక్టర్‌ది తప్పంటూ చైర్మన్‌ ప్రశ్నించారు. తొలుత పెన్షన్‌కు అర్హులంటూ సర్టిఫికెట్‌ ఇచ్చిన డాక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని అభిప్రాయపడ్డారు.

కో ఆప్షన్‌ సభ్యులు కరీముల్లా మాట్లాడుతూ డెంగీ జ్వరాలు వస్తుంటే ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారని తెలిపారు. రిమ్స్‌లో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. రిమ్స్‌లో ప్లేట్‌లెట్స్‌ ఎక్కిస్తున్నారన్న విషయం ప్రజలకు తెలియదని, దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. దోమల బెడద అధికంగా ఉందని, ఫాగింగ్‌ యంత్రాలు మూలన పడేశారని విమర్శించారు. దీనిపై జెడ్పీ చైర్మన్‌ స్పందిస్తూ ఆ యంత్రాలకు మరమ్మత్తులు చేయించి వినియోగంలోకి తీసుకు రావాలని అధికారులకు సూచించారు.

పార్నపల్లె రిజర్వాయర్‌ నుంచి వేముల మండలంలోని నాయని చెరువుకు గ్రావిటీపై సాగునీరు వస్తోందని వేముల జెడ్పీటీసీ బయపురెడ్డి అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ లేని కారణంగా భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, బక్కన్నగారిపల్లెకు నీటిని లిఫ్ట్‌ చేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు.

పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్‌ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో షెడ్యూల్‌ కులాల్లోని మూడవ కేటగిరీకి చెందిన వారికి అన్యాయం జరిగిందన్నారు. అర్హత సాధించి వెరిఫికేషన్‌ పూర్తయినప్పటికీ హారిజెంటల్‌ పద్దతిలో నియామకాలు చేపట్టి అన్యాయం చేశారని ఆరోపించారు. జీఓ నెం. 77 ప్రకారం నియామకాలు చేపట్టకుండా హారిజెంటల్‌ పద్ధతిని అనుసరించడం వల్ల ఈ అన్యాయం జరిగిందని, దీనిపై పునః పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలయ్య, పలువురు జెడ్పీటీసీలు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement