గాలివీడు : బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ దేశమైన ఖతార్‌కు వెళ్లిన పఠాన్ ఫయాజ్ (29) మంగళవారం గుండె పోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికుల కథనం మేరకు గాలివీడు పట్టణం గేటు నాలుగు రోడ్ల కూడలి వద్ద నివాసం వుంటున్న అజీజ్‌ఖాన్ కుమారుడు ఫఠాన్ ఫయాజ్ బ్రతుకు దెరువు కోసం ఖతార్ వెళ్లాడు. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఫయాజ్ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే తమ బిడ్డ తమనుండి దూరమవ్వడం జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
చిట్టీలు కట్టించుకుని..
చెల్లించలేనంటూ..
బి.కొత్తకోట : చీటీల పేరుతో వ్యాపారం చేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. తిరిగి మొత్తాలను చెల్లించలేనని చేతులెత్తేశాడు. బి.కొత్తకోట మండలంలో ఎనిమిదేళ్లు పనిచేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొన్ని నెలల కిందట తంబళ్లపల్లి మండలానికి బదిలీపై వచ్చారు. ఇతను చాలాకాలంగా చిట్టీలు నిర్వహిస్తూ సకాలంలో డబ్బులు చెల్లించేవాడు. దీంతో ఉపాధ్యాయులతోపాటు స్థానికుల్లో నమ్మకం కుదిరింది. భారీ సంఖ్యలో ఇతడి వద్ద చిట్టీలు వేశారు. అయితే మూడు రోజులు క్రితం తాను డబ్బు చెల్లించాల్సిన వ్యక్తుల ఫోన్ నెంబర్లతో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేశాడు. ఆ గ్రూపులో తన వద్ద చిట్టీలు వేసిన వారికి తిరిగి డబ్బు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పుకున్నాడు. తనకు చెందిన భూమిని విక్రయించి దాని ద్వారా వచ్చిన డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పుకున్నాడు. దీంతో డబ్బు చెల్లించిన వాళ్లంతా ఆందోళనలో పడ్డారు. సుమారు రూ.4 కోట్ల వరకూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజలకు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. తమ డబ్బు తిరిగి వస్తుందో రాదోనని లబోదిబోమంటున్నారు.
హత్య కేసులో
నిందితుడికి జీవిత ఖైదు
గాలివీడు : మండలంలోని నల్లబత్తిన వాండ్లపల్లెకి చెందిన సుబ్బారాయుడు హత్య కేసులో ఆయన అన్న రాజుపాలెం నాగయ్య(74)కు జీవిత ఖైదు విధిస్తూ రాయచోటి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. పోలీసుల కథనం మేరకు.. 2022 జూన్, 14న మల్లేశ్వరస్వామి మొక్కుబడి విషయంలో తోటిగాండిమడుగు వద్ద మేక నరికే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తరువాత సాయంత్రం 5 గంటల సమయంలో తమ్ముడు సుబ్బారాయుడుపై వేట కొడవలితో నాగయ్య దాడి చేయగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై గాలివీడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. మంగళవారం రాయచోటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎస్.కృష్ణన్ కుట్టి ఆధ్వర్యంలో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
జూద స్థావరాలపై దాడులు
మదనపల్లె రూరల్ : మండలంలోని సీటీఎం, బసినికొండలోని జూద స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి పది మంది జూదరులను అరెస్ట్ చేసినట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. మంగళవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడుతూ సీటీఎం, బసినికొండ సత్యనారాయణస్వామిగుడి వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్, తాలూకా పోలీసుల సహాయంతో మెరుపుదాడులు నిర్వహించామన్నారు. ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.56,200 నగదు, మూడు మోటార్ సైకిళ్లు, 8 సెల్‌ఫోన్‌లు సీజ్ చేశామన్నారు. దాడులు జరిపే క్రమంలో సీటీఎంకు చెందిన జనార్దన్, గుర్రంకొండకు చెందిన ఉత్తన్న, కలికిరికి చెందిన రామాంజులు పారిపోయారని, వారిపై కేసు నమోదుచేశామని తెలిపారు. అదేవిధంగా బసినికొండ సత్యనారాయణస్వామి గుడి వద్ద పేకాడుతున్న నలుగురిని అరెస్ట్‌చేసి వారి నుంచి రూ.2,800 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జూదం నిర్వహించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.
విద్యార్థికి గోల్డ్ మెడల్
కడప ఎడ్యుకేషన్ : కడప ప్రభుత్వ పురుషుల కళాశాల(స్వయం ప్రతిపత్తి)లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ విద్యార్థిని అంకాల శైలజ (ఎం.కామ్ 2022–24 బ్యాచ్) గోల్డ్ మెడల్ సాధించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. ప్రిన్సిపల్ జి.రవీంద్రనాథ్ అభినందించారు.