
రైతు భూమిపై టీడీపీ నేత కన్ను
మదనపల్లె రూరల్ : కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి పంటను నాశనం చేయడమే కాకుండా.. చంపేస్తామని రైతును టీడీపీ నాయకుడు బెదిరించిన ఘటన ఆదివారం మదనపల్లె మండలం పోతబోలులో జరిగింది. పట్టణంలో నివాసం ఉంటున్న గాలి వెంకటసుబ్బయ్య కుమారుడు గాలి రవీంద్ర పోతబోలు గ్రామం సర్వే నంబర్: 605లో 0.25 సెంట్ల వ్యవసాయభూమిని హక్కుదారురాలైన బత్తెన్న గారి పాపన్న అలియాస్ వెంకటస్వామి భార్య రెడ్డెమ్మ నుంచి కొనుగోలు చేశాడు. వ్యవసాయం చేస్తున్నాడు. ప్రస్తుతం ఉలవ పంట వేశాడు. అయితే ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నాయకుడు బురుజు పెద్దరెడ్డెప్ప.. కొంత మందితో కలిసి ఆదివారం దౌర్జన్యంగా భూమిలోకి ప్రవేశించడమే కాకుండా ట్రాక్టర్‌తో ఉలవ పంటను దున్ని, జొన్నలు వేసేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న గాలి రవీంద్ర అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అతడిని చంపేస్తామని బెదిరించాడు. దీంతో చేసేదేమీలేక బాధితుడు తాలూకా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, భూమికి, పెద్దరెడ్డెప్పకు ఎలాంటి సంబంధం లేదని, భూరికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. టీడీపీ నాయకుడితో ప్రాణహాని ఉన్నందున, రక్షణ కల్పించాల్సిందిగా వినతి చేశాడు.
పంటను దున్నేసిన వైనం