
పనిగంటల పెంపు నిర్ణయం రద్దు చేయాలి
రాయచోటి జగదాంబసెంటర్ : కార్మిక శ్రమను దోచే పని గంటలను తక్షణమే రద్దుచేయాలని, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ.నాగేశ్వరరావు అన్నారు. రాయచోటి ఎన్‌జీఓ హోంలో సీఐటీయూ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి పని గంటల పెంపు నిర్ణయం మరణశాసనంగా మారుతుందని, మూడు షిప్టులు, రెండు షిప్టులుగా మారడంతో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉపాధి పోతుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ సర్వేలో కార్మికులలో హృద్రోగ మరణాలు పెరుగుతున్నాయని, సుదీర్ఘ పనిగంటలతో మానసిక మస్యలు పెరుగు తాయన్నారు. కార్మికుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో ఛిన్నాభిన్నం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పని విధానం ఉన్నప్పుడే అనేక పరిశ్రమల్లో 12 గంటలు పనిచేయించడం జరిగిందని, ఇపుడు కార్మికులతో 14, 16 గంటలు పని చేయించుకుని బానిసలుగా మారుస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయకపోతే కార్మికులు, ఉద్యోగులు పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. 12వ పీఆర్‌సీ ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. లేబర్ కోడ్స్ రద్దు కొరకు దీర్ఘకాలిక ఐక్య పోరాటాలు చేయడానికి సీఐటీయూ కీలకపాత్ర పోషిస్తోదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎ.రామాంజులు, హరిశర్మ, డి.భాగ్యలక్ష్మి, మెహరున్నీసా, వెంకట్రామయ్య, ఓబులమ్మ, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ.నాగేశ్వరరావు