
బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : ఫిర్యాదులపై అలసత్వం లేకుండా బాధితులకు న్యాయం అందించాలని అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఎస్పీ పర్యవేక్షించారు. ప్రతి ఫిర్యాదుదారుడితో ముఖాముఖి మాట్లాడి సమస్యల మూలాలను తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి రాలేని అర్జీదారులు సమీప పోలీస్‌స్టేషన్, సర్కిల్ లేదా సబ్ డివిజన్ కార్యాలయంలో అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. పోలీసు అధికారులతో ఫోన్లో స్వయంగా మాట్లాడి, కీలక సూచనలు చేశశారు. ప్రజాసేవలో పోలీసులు నిరంతరం ముందుంటారని, ప్రజలు ధైర్యంగా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ పేర్కొన్నారు.
హుండీ ఆదాయం లెక్కింపు
సిద్దవటం : శ్రీ నిత్యపూజ స్వామి హుండీ ఆదాయం లెక్కించగా రూ.60,785 ఆదాయం వచ్చినట్లు దేవదాయశాఖ రాజంపేట ఇన్‌స్పెక్టర్ జనార్ధన్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ.శ్రీధర్‌లు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను గ్రామస్తుల సమక్షంలో లెక్కించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది చంద్ర, వంతాటిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ దరఖాస్తు గడువు పెంపు
మదనపల్లె సిటీ : ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి గడువును అక్టోబర్ 31వతేదీ వరకు పెంచినట్లు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పఠాన్ మహమ్మద్‌ఖాన్ తెలిపారు. రూ.200 అపరాధ రుసుంతో అవకాశం కల్పించారన్నారు. 14 సంవత్సరాలు వయస్సు నిండిన వారు పదోతరగతిలో, అలాగే 10వ తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందొచ్చన్నారు. ఓపెన్ స్కూల్ దారా ప్రవేశం పొందినవారు సెలవు దినాల్లో నిర్వహించే తరగతులకు హాజరుకావాలన్నారు.అడ్మిషన్ పొందిన వెంటనే అభ్యర్థులు పెట్టిన చిరునామాకు పాఠ్యపుస్తకాలు పంపబడుతాయన్నారు. పూర్తి వివరాలకు 8121852786 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

బాధితులకు న్యాయం చేయాలి