
న్యాయం గెలిచింది
● ఎంపీ మిథున్‌కు బెయిల్‌పై సంబరాలు
● కూటమి అక్రమ అరెస్ట్‌లకు
భయపడమంటూ నినాదాలు
మదనపల్లె : రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని జూలై 19న కూటమి ప్రభుత్వం మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసింది. 72 రోజులపాటు నిర్బంధించింది. బెయిల్ రాకుండా కుట్రలు, కుతంత్రాలు చేసింది. బెయిల్ కోసం న్యాయస్థానం ముందు పిటిషన్ వేస్తే.. అడ్డుకునేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్ వేసింది. అరెస్ట్ అయిన 62 రోజుల తర్వాత సిట్ కస్టడి కోరడం, దాని వెనక ఉద్దేశం ఇట్టే అర్థమవుతుంది. అక్రమ అరెస్ట్ నుంచి.. ఎన్నో వేధింపులు, ఇబ్బందులకు గురి చేసినా చివరకు న్యాయమే గెలిచింది.
సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తమ నేతను అక్రమ కేసులో నిర్బంధించి, వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరు వార్త బయటకు రాగానే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్దిరెడ్డి కుటుంబ అభిమానులు, అనుచరులు, వైఎస్సార్‌సీపీప నేతలు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. మిథున్ రెడ్డి బ్యానర్లు చేతబట్టి.. జై జగన్, జై మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి, కక్షగట్టి వేధిస్తున్న చంద్రబాబుకు అధికార పతనం తప్పదు అంటూ హెచ్చరించారు.
అక్రమ మద్యం కేసులో పసలేదు. ఎంపీగా మిథున్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రమేయం ఉండదు. మద్యం వ్యవహారంలో ఆయన పాత్ర లేదు. నిరూపించేందుకు కనీస ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ వేధించాలన్న లక్ష్యంతో అక్రమ కేసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం ద్వారా తప్పుడు కేసు అని నిరూపితమైంది.
– దేశాయి తిప్పారెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే
ఎంపీ మిథున్ రెడ్డి పై పెట్టిన మద్యం అక్రమ కేసు ముమ్మాటికీ తప్పుడు కేసే.సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేశారని మిథున్ రెడ్డి చెప్పడం అక్షరాలా నిజమైంది. వైఎస్సార్‌సీపీని బలహీనపర్చాలన్న టీడీపీ కుట్రలు సాగవు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి చావుదెబ్బ తప్పదు.
– నిసార్ అహ్మద్, వైఎస్సార్‌సీపీ, మదనపల్లె సమన్వయకర్త

న్యాయం గెలిచింది

న్యాయం గెలిచింది