
వైభవం.. బిందెసేవ గ్రామోత్సవం
రాజంపేట టౌన్ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గ్రంధే సత్యనారాయణగుప్త ఆధ్వర్యంలో నిర్వహించిన బిందెసేవ గ్రామోత్సవ సంబరం అంబరమంటింది. అమ్మవారిశాల మాడవీధులతో పాటు పట్టణంలోని మెయిన్‌రోడ్డు, పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తి, జానపద గేయాలకు కళాకారులు ప్రదర్శించిన కోలాటం ప్రజలను అబ్బురపరిచింది. దారివెంబడి గుర్రం చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. అమ్మవారి బిందెసేవలో రాజంపేట పట్టణ వాసులే కాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.