అభివృద్ధి పనుల్లో కౌన్సిలర్లను గౌరవించాల్సిందే | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో కౌన్సిలర్లను గౌరవించాల్సిందే

Sep 30 2025 7:43 AM | Updated on Sep 30 2025 7:43 AM

అభివృద్ధి పనుల్లో కౌన్సిలర్లను గౌరవించాల్సిందే

అభివృద్ధి పనుల్లో కౌన్సిలర్లను గౌరవించాల్సిందే

మదనపల్లె : ప్రజలు గెలిపించిన కౌన్సిలర్లకు వారి వార్డుల్లో గౌరవం ఉండేలా.. ఆయా ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంలో కౌన్సిలర్లకు తప్పనిసరిగా గౌర్వం ఇవ్వాలని, ఆలాగే వారి అమోదంతోనే పనులను ప్రతిపాదించాలని మున్సిపల్‌ చైర్మన్‌ వరపన మనూజ స్పష్టం చేశారు. సోమవారం ఆమె అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలు, తాము ప్రతిపాదించని పనులను అజెండాలో ఉన్నట్టు ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన చైర్మన్‌ అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. వార్డుల్లో ఏ పని చేయాలన్నా కౌన్సిలర్ల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఇలా జరగని పక్షంలో కౌన్సిల్‌ అజెండాలో పెట్టే పనులను తిరస్కరిస్తామని హెచ్చరించారు. వైస్‌చైర్మన్‌ జింకా చలపతి మాట్లాడుతూ కౌన్సిల్‌ పదవీకాలం ఉన్నంత వరకై నా కౌన్సిలర్లను గౌరవించండని కోరారు. తమ వార్డులో వీధిలైట్లు వెలగడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పాలన్నారు. కౌన్సిలర్లు బీఏ.ఖాజా, శ్రీనివాసులు, ప్రసాద్‌, రాజేష్‌ మాట్లాడుతూ కౌన్సిలర్లకు విలువ లేకుండా పోతోందని, కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్పితే కూటమి పాలనలో ఒక్క పని జరగలేదన్నారు. అభివృద్ధి పనుల పేరిట చెపడుతున్న పనులకు బిల్లులు ఇవ్వకుండా పనులు పెట్డడం ఎందుకు, వాటిని రద్దు చేయండని నిలదీశారు. ఆర్‌అండ్‌బీ రహదారిలో సిమెంటు రోడ్డును వేయిస్తున్న అధికారులు చిత్తూరుబస్టాండ్‌లోని గుంతలపై మానవత్వంలో స్పందించి పనులు చేయించాలని కోరారు. కౌన్సిలర్లు ఉండగా టీడీపీ వార్డు ఇన్‌చార్జ్‌లు చెప్పే పనులకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమన్నారు. దీనితో కౌన్సిలర్లకు విలువలేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రావడంతోనే పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని మండిపడ్డారు. కౌన్సిలర్‌ కరీముల్లా మాట్లాడుతూ మున్సిపాలిటీకి పన్నుల రూపంలో ఎంత ఆదాయం వస్తోందని, అన్నివార్డులకు సమంగా అభివృద్ధి పనులు చేస్తున్నారా అని ప్రశ్నించారు. మౌలిక వసతుల కల్పనలో అధికారులు విఫలం అవుతున్నారని ఆరోపించగా.. ఆదాయం, పనులకు సంబంధించి కమిషనర్‌ ప్రమీల వివరణ ఇచ్చారు. కౌన్సిలర్‌ షబానా మాట్లాడుతూ పట్టణంలోని చిత్తూరుబస్టాండ్‌, ఫైర్‌స్టేషన్‌, మిషన్‌కాంపౌండ్‌ వద్ద పెట్టుకున్న దుకాణాలకు అనుమతి ఎవరు ఇచ్చారు, వారి నుంచి అద్దెలను ఎవరు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ ప్రమీల చెప్పారు. టీడీపీ కౌన్సిలర్‌ తులసీ మాట్లాడుతూ అభివృద్ధి పనులు అజెండా పెడుతున్నారే కానీ కౌన్సిల్‌ వాటి పనులు చేపట్టడం లేదని, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించడంతో వైస్‌చైర్మన్‌ జింకా చలపతి, కౌన్సిలర్‌ రాజేష్‌ మాట్లాడుతూ కూటమిపాలన రాకతోనే అభివృద్ధికుంటుపడిందని, ఈ విషయమై ఎమ్మెల్యేను ప్రశ్నించాలని కోరారు. తర్వాత కరీముల్లా, తులసీలు సమావేశం నుంచి వెళ్లిపోయారు.

అజెండా వద్దంటూ కౌన్సిల్‌ వాకౌట్‌

కౌన్సిల్‌ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపాల్సిన అంశాలపై అధికారులు అజెండాను రూపొందించారు. 30 అంశాలపై ఆమోదం తెలపాల్సి ఉండగా దానిపై కనీస చర్చ లేకుండా కౌన్సిల్‌ మొత్తం నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్‌ చేసింది. దీనితో అజెండాను పట్టించుకోకుండా అర్ధాంతరంగా కౌన్సిల్‌ సమావేశాన్ని ముగించారు. దీనిపై చైర్మన్‌ మనూజ మాట్లాడుతూ కౌన్సిలర్ల అభిప్రాయాలు తీసుకోకుండా, వారిని నిర్లక్ష్యం చేసి అజెండా అంశాలను ప్రతిపాదించిన కారణంగా వాటిపై చర్చలేకుండా తిరస్కరించామని చెప్పారు. దీని కారణంగానే సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించామని చెప్పారు. ఈ సమావేశంలో మేనేజర్‌ పీఆర్‌.మనోహర్‌, డీఈ శ్రావణీ, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ వెంకటసుబ్బయ్య, ఏఈ రవీంద్రనాయక్‌, ఆర్‌ఐలు శ్రీనివాసులు, తిరుమల, సిబ్బంది పాల్గొన్నారు.

లేదంటే అజెండా అంశాలను నిక్కచ్చిగా తిరస్కరిస్తాం

అధికారులను హెచ్చరించిన చైర్మన్‌ మనూజ

సమస్యలపై కౌన్సిలర్ల ఏకరువు

ఆపై అజెండాపై చర్చ, ఆమోదం తెలపకుండా కౌన్సిల్‌ వాకౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement