
పెన్షన్.. టెన్షన్!
మదనపల్లె: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన కార్యాచరణలో భాగంగా అక్టోబర్ ఒకటిన జరగాల్సిన సామాజిక పింఛన్ల పంపిణీ కోసం బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రాను నిరాకరిస్తూ ఎవరూ నగదు దగ్గర పెట్టుకోకూడదని నిర్ణయించారు. వచ్చే గురువారం పింఛన్ల పంపిణి జరగాలి. తెల్లవారుజాము నుంచే పింఛన్‌దారుల ఇళ్లవద్దకే వెళ్లి అందజేయాలి. అయితే సచివాలయ ఉద్యోగ సంఘాల జేఏసీలు అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా వాట్సప్ గ్రూపుల నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చారు. జిల్లాలో పింఛన్ల పంపిణీకి సోమవారం పోగా రెండురోజులు మిగిలి ఉంటాయి. ఈ రెండురోజుల్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఆయా సచివాలయాల ఉద్యోగులు సన్నద్దం కావాలి. ఒకరోజు ముందుగా బ్యాంకులనుంచి న గదును విత్‌డ్రా చేసుకుని తమవద్ద సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకటిన తెల్లవారుజాము నుంచే పంపిణీ మొదలవ్వాలి. అయితే ఇప్పటిదాకా దీనిపై స్పష్టత లేకుండాపోయింది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయలేదు. జేఏసీ ప్రతినిధులతో చర్చించేందుకు నిర్ణయించగా వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టి యథావిధిగా పంపిణీ చేయిస్తుందా స్పష్టత లేదు. ఒకవేళ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తే..వీరికి ప్రత్యామ్నయంగా సంఘమిత్ర, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు అధికారులతో పింఛన్ల పంపిణీ చేయించే అవకాశం ఉందని జేఏసీ రాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు. అక్టోబర్ ఒకటిన జిల్లాలోని 30 మండలాలు, మూడు మున్సిపాలిటీల్లోని 500 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 4,029 మంది ఉద్యోగులు..జిల్లాలోని 2,17,657 మంది పెన్షన్‌దారులకు రూ.93.94 కోట్లు పంపిణి చేయాల్సి ఉంది.
అక్టోబర్ ఒకటిన పింఛన్లు ఇవ్వమని సచివాయల జేఏసీ అల్టిమేటం
జిల్లాలో 2,17,657 మందికి రూ.93.94 కోట్ల పంపిణీ జరగాలి
ప్రత్యామ్నయంపై దృష్టి పెట్టని ప్రభుత్వం