
రూ.925 కోట్లతో హంద్రీ–నీవా పనులు
మదనపల్లె: జిల్లాలో హంద్రీ–నీవా ప్రధానకాలువ, నీవా ఉప కాలువల అసంపూర్తి పనులు, వాటికి కొత్త కాంక్రీట్ లైనింగ్ పనులు చేయించడం కోసం రూ.925 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మదనపల్లె సర్కిల్–3 ఎస్‌ఈ ఆర్.విఠల్‌ప్రసాద్ చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాసపురం, అడివిపల్లె రిజర్వాయర్లకు కృష్ణా జలాలను తరలించడం కోసం మిగిలిపోయిన పనులను పూర్తి చేయించాల్సి ఉందని చెప్పారు. దీనికోసం ప్రధాన కాలువ ప్యాకేజీ–1కు రూ.242.95 కోట్లు, ప్యాకేజీ–2కు రూ.177.81 కోట్లు, నీవా ఉప కాలువ అసంపూర్తి పనులు, లైనింగ్ కోసం మూడు ప్యాకేజీల్లో రూ.504.55 కోట్లతో పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపాలని కోరుతూ సీఈ ప్రభుత్వానికి నివేదించారని చెప్పారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జలాలతో నింపుతున్నామని అన్నారు. కాలువలో ప్రవహిస్తున్న నీటిని రైతులు పైపుల ద్వారా, మోటార్లతో నీటి చౌర్యానికి పాల్పడుతున్నారని అన్నారు. కాలువను తెగ్గొట్టడం, నీటిని మళ్లించుకోవడం లాంటి చర్యలు పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో జరుగుతోందన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అధికారికంగా ప్రణాళిక ప్రకారం నీటిని తరలిస్తామని చెప్పారు. ఎక్కడైనా కాలువను తెగ్గొడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎస్‌ఈ విఠల్‌ప్రసాద్