
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
గాలివీడు : గాలివీడు మండల పరిధిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలయ్యాయి. గాలివీడు నుంచి రాయచోటికి స్కూటీలో వెళుతున్న తిమ్మమ్మ మర్రిమానుకు చెందిన రమణయ్య, నరసింహులు వడిశిలంక పల్లెకు సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇరువురు గాయపడగా, రమణయ్య తలకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ములకలచెరువు : కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం మండలంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన చిన్నప్ప(32) పెద్దపాళ్యం పంచాయతీ వీరాంజనేయపురానికి చెందిన లావణ్యను వివాహం చేసుకున్నాడు. తర్వాత కొద్ది నెలలకు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీనిపై మంగళవారం రాత్రి మొదటి భార్య లావణ్య ఇంటికి వచ్చిన చిన్నప్ప ఆమెతో గొడవ పడ్డా డు. అనంతరం మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడి వారు 108 సహాయంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు ఽనమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యపై దాడి
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో భార్యపై భర్త దాడి చేసిన ఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. కురవంకకు చెందిన రామాంజులు భార్య భారతి (25) ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రోగులకు డైట్ సరఫరా చేసే విభాగంలో పనిచేస్తుంది. బుధవారం సాయంత్రం ఆమె ఆస్పత్రుల్లో విధుల్లో ఉండగా, భర్త రామాంజులు అక్కడకు వచ్చి కుటుంబ సమస్యల కారణంగా ఆమెతో గొడవపడి, అక్కడే ఉన్న సాంబార్ బకెట్ ఆమె ముఖంపై పోసి దాడి చేశాడు. దాడిలో ఆమె గాయపడగా స్థానికులు అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స అందించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు