
ప్రభుత్వ భూముల కబ్జాను అరికట్టండి
ఓబులవారిపల్లె : బాలిరెడ్డిపల్లి, వై.కోట, పెద్దఓరంపాడు ప్రాంతాలలో నిరుపేదలకు దక్కాల్సిన ప్రభుత్వ బంజరు, చెరువు ఆయకట్టు భూములను వందల ఎకరాలను కబ్జా చేస్తున్నారని, వాటిని అడ్డుకొని నిరుపేద దళిత, గిరిజన, ముస్లిం మైనార్టీ వర్గాలకు పంపిణీ చేయాలని బీకేఎంయూ నాయకులు బుధవారం డిప్యూటీ తహసీల్దార్ సిద్దేశ్వర రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలిరెడ్డిపల్లి, వై.కోట సర్వే నెంబరు. 1155, 1194లలో దాదాపు 150 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిలో నిరుపేద దళిత, ముస్లిం మైనార్టీలు గతంలో చెట్లను, రాళ్లను తొలగించి లక్షల రూపాయలు అప్పు చేసి అనుభవంలో ఉంచుకున్నారన్నారు. గతంలో ఉన్నతాధికారులు ఆ భూమిని పరిశీలించి అర్హులైన పేదలకు అసైన్‌మెంట్ కమిటీ ద్వారా భూములు ఇస్తామని చెప్పారన్నారు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వాటిని అడ్డుకొని పేదలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట దశలవారీగా సామూహిక దీక్షలు చేపడతామన్నారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీకేఎంయూ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మల్లిక, వెంకటరమణ, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పండుగోల మణి, రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి ఎం.జయరామయ్య, మండల నాయకులు, కటారి గోపాలు, రాఘవులు, బాలాజీ నగర్, శివాజీ నగర్ గిరిజన పేద ప్రజలు తదితరులు పాల్గొన్నారు.