
తల్లి మందలించిందని కుమారుడు..
మదనపల్లె రూరల్ : పనులకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండడంతో తల్లి మందలించింది. మనస్తాపం చెందిన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మదనపల్లె మండలంలో మంగళవారం జరిగింది. వేంపల్లెకు చెందిన శంకర, హేమావతి దంపతుల కుమారుడు హిమగిరి(16) పదో తరగతి ఫెయిల్ కావడంతో పట్టణంలోని ఓ మెకానిక్ వద్ద పనిచేస్తున్నాడు. తండ్రి శంకర కొంతకాలం కిందట మృతి చెందడంతో తల్లి హేమావతి కూలి పనులకు వెళుతూ జీవిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా హిమగిరి పనులకు వెళ్లకుండా తిరుగుతుండటంతో మంగళవారం తల్లి మందలించింది. మనస్తాపం చెందిన హిమగిరి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.