
ఈ కందిపప్పు మాకొద్దు
వెనక్కు పంపించేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు
బద్వేలు అర్బన్ : చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యతలేని కందిపప్పు సరఫరా అవుతోంది. నాసిరకంగా ఉన్న ఈ కందిపప్పు మాకొద్దు అని అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి పంపేయడం ఇందుకు అద్దం పడుతోంది. బద్వేల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని బద్వేల్ మున్సిపాలిటీ, బద్వేల్ రూరల్, గోపవరం, బి.కోడూరు, అట్లూరు మండలాల్లో 180 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో కొన్నింటికి ఇటీవల సరఫరా చేసిన కందిపప్పు పురుగులతో బూజుపట్టి ఉంది. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు తీసుకునేందుకు నిరాకరించారు. చేసేది లేక అంగన్వాడీ కార్యకర్తలు ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో తిరిగి ఇచ్చేస్తున్నారు. నాసిరకం కందిపప్పు పంపిణీ చేయడంతో సమస్యలు ఎదురైతే మేము ఇబ్బంది పడాల్సి వస్తుందని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు.
36 క్వింటాళ్ల నాసిరకం కందిపప్పు వచ్చింది
ఇటీవల ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు వచ్చిన 36 క్వింటాళ్ళ కందిపప్పు నాసిరకంగా ఉంది. ఆగస్టు వరకు గడువు ఉన్నా.. కొంతమేర బూజు పట్టి ఉండడం చూసి జిల్లా ఉన్నతాధికారులకు విషయం విన్నవించాను. తక్షణమే కందిపప్పును వెనక్కి పంపించాలని ఆదేశాలిచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి తెస్తున్న కందిపప్పు స్థానంలో మంచి కందిపప్పు అందిస్తున్నాం.
– అలీఖాన్, ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి

ఈ కందిపప్పు మాకొద్దు