ఇలాగైతే ఎలాగండి ! | - | Sakshi
Sakshi News home page

ఇలాగైతే ఎలాగండి !

Jul 22 2025 7:37 AM | Updated on Jul 22 2025 8:12 AM

ఇలాగైతే ఎలాగండి !

ఇలాగైతే ఎలాగండి !

చక్రాయపేట : శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా గండి ఆలయ ప్రాంగణంలో ప్రతి యేటా వేసే జర్మన్‌ షెడ్డు ఈసారి సమస్యగా మారింది. దీనికి తోడు పారిశుధ్య కార్మికుల సమస్య కూడా ఉత్సవాల్లో తలెత్తడంతో ఇబ్బందికర పరిస్థితులు నెల కొంటున్నాయి. ఇందుకు ఆలయ సహాయ కమిషనర్‌ ఒంటెద్దు పోకడే కారణమని పాలక మండలి, కూటమి నేతలు, పలువురు భక్తులు విమర్శిస్తున్నారు.

అధికారి అన్నీ తానే అని భావించడంతోనే..

ఉత్సవాల సందర్భంగా ఆలయ పాలక మండలి, సిబ్బంది కలిసి అధికార పార్టీకి చెందిన నేతల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి వారి ద్వారా టీటీడీ వారిని కలిసి జర్మన్‌ షెడ్డు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయించుకొనేవారు. కాని ఈ దఫా మాత్రం ఆలయ అధికారితో పాటు కాబోయే చైర్మన్‌ అని ప్రచారం చేసుకునే వ్యక్తి, ప్రధాన అర్చకుడు మాత్రమే నేరుగా టీటీడి అధికారులను కలసి జర్మన్‌ షెడ్డు, పారిశుధ్య కార్మికులు కావాలని వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన టీటీడీ ఈఓ ఆలయం దేవదాయ శాఖ పరిధిలో ఉంది. టీటీడీ ఎందుకు ఇవ్వాలి. దేవదాయ శాఖ తరపునే వాటిని సమకూర్చుకోవాలని లేఖ ద్వారా తెలియజేశారు. గతంలో శ్రావణ మాస ఉత్సవాలు అనగానే కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందుగానే ఇక్కడి అధికారులను అప్రమత్తం చేసి తానూ ప్రత్యేక చొరవ చూపేవారు. దీంతో టీటీడీ వారు మారు మాట్లాడక నేరుగా వచ్చి జర్మన్‌ షెడ్డు వేసి పారిశుధ్య కార్మికులను ఇక్కడ వదిలి వెళ్లేవారు. నేడు అధికారి నేతల సహకారం తీసుకోనందునే ఇబ్బంది పడాల్సి వస్తోందని పలువురు భక్తులు ఆలయ అధికారి తీరును తప్పు పడుతున్నారు.

దిక్కుతోచక నేతల వద్దకు..

టీటీడీ అధికారులు జర్మన్‌ షెడ్డు, పారిశుధ్య కార్మికులను పంపడం లేదని చెప్పడంతో దిక్కుతోచక ఆలయ అధికారి కాబోయే చైర్మన్‌ సహకారంతో పులివెందుల నియోజకవర్గ టీటీడీ ఇన్‌చార్జి బీటెక్‌ రవిని కలిసి తమ ఇబ్బందిని వివరించారు. కానీ టీడీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్సీ రామ గోపాల్‌రెడ్డిని కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ల లేదని ఆయన అనుచరులు ఆలయ సహాయ కమిషనర్‌పై మండి పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సారీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి చొరవతో జర్మన్‌ షెడ్డు, పారిశుధ్య కార్మికులు వస్తే నిరుడు జరిగిన శ్రావణ మాస ఉత్సవాల సమయంలో ఎమ్మెల్సీ రామగోపాల్‌ రెడ్డి చొరవ చూపడంతో వాటిని వేశారని కొందరు నేతలు పేర్కొంటున్నారు. ఈసారి ఎమ్మెల్సీని ఆలయ అధికారి ఖాతరు చేయక పోవడం వెనుక కారణం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.

జర్మన్‌ షెడ్‌ ఎందుకంటే..

ఉత్సవాల సందర్భంగా గండిలో ప్రతి యేటా టీటీడీ వారు వేసే విశాలమైన జర్మన్‌షెడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. వర్షం వస్తే అందులో సుమారు 2వేల మంది వరకు తలదాచుకొనేవారు. పైగా భక్తుల కాలక్షేపం నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందులోనే నిర్వహించేవారు.

పారిశుధ్య కార్మికులు లేకుంటే..

టీటీడీ తరపున వచ్చే పారిశుధ్య కార్మికులు నెల రోజుల పాటు ఉచితంగా ఆలయ ప్రాంగణంతో పాటు పాపాఘ్ని నదిని పరిశుభ్రంగా ఉంచే వారు. జర్మన్‌ షెడ్డుతో పాటు పారిశుధ్య కార్మికుల ఖర్చు టీటీడీ వారు భరించడంతో ఆలయ ఆదాయానికి గండి పడేది కాదు. నేడు టీటీడీ వారు మొండి చేయి చూపడంతో జర్మన్‌ షెడ్డుతో పాటు పారిశుధ్య కార్మికుల ఖర్చును ఆలయం నుంచి భరించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రూ.15 లక్షల పైగా ఆలయ నిధులే ఖర్చు చేయక తప్పదు.

మా దృష్టికి రాలేదు..

జర్మన్‌ షెడ్డు, పారిశుధ్య కార్మికుల విషయం తన దృష్టికి కానీ, పాలక మండలి సభ్యుల దృష్టికి కానీ రాలేదు. సహాయ కమిషనర్‌ ఏమి చేస్తున్నాడో తెలియలేదు. చివరకు తానే జర్మన్‌ షెడ్‌, పారిశుధ్య కార్మికుల పరిస్థితి ఏంటని అడిగితే టీటీడీ వారు నిరాకరించారని వారు పంపిన లేఖను తనకు వాట్సాప్‌లో పంపారు. ఆయన ఒంటెద్దు పోకడల వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. అని ఆలయ చైర్మన్‌ కావలి కృష్ణతేజ పేర్కొన్నారు.

ఆలయ అధికారి ఏమంటున్నారంటే..

టీటీడీ వారు జర్మన్‌ షెడ్డు, పారిశుధ్య కార్మికులను తాము ఇవ్వలేమని లేఖ పెట్టారు. వెంటనే బీటెక్‌ రవిని కలిసి పరిస్థితి వివరించాను. ఎమ్మెల్సీ రామ గోపాల్‌రెడ్డిని కూడా కలుస్తాము. ఆలయంలో చలువ పందిళ్లు టెండర్లు దక్కించుకున్న వారికై నా చెప్పి ఆలయ ఖర్చుతోనే షెడ్డు వేయించాలి. లేకుంటే ఇబ్బంది అవుతుంది. ఈ విషయాన్ని దేవదాయశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాను.. అని ఆలయ సహాయ కమిషనర్‌ వెంకటసుబ్బయ్య వివరించారు.

గండి ఆలయ అధికారి

ఏకపక్ష ధోరణిపై విమర్శలు

జర్మన్‌ షెడ్డు వేసేందుకు టీటీడీ నిరాకరణ

పారిశుద్ధ్య సిబ్బందిని పంపేందుకూ

అంగీకరించని వైనం

రూ.15 లక్షలు ఆలయ ఆదాయానికి గండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement