అది పరువు హత్యేనా ? | - | Sakshi
Sakshi News home page

అది పరువు హత్యేనా ?

Jul 22 2025 7:37 AM | Updated on Jul 22 2025 8:12 AM

అది పరువు హత్యేనా ?

అది పరువు హత్యేనా ?

జమ్మలమడుగు : గండికోటలో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించినట్లు తెలిసింది. నిందితులను గుర్తించినట్లు సమాచారం. చిన్న చిన్న సాంకేతిక అడ్డంకులు ఉండటంతో నిందితుల వివరాలు వెల్లడించలేకపోతున్నారని తెలుస్తోంది. ఈనెల 15వ తేదీన ప్రొద్దుటూరుకు చెందిన వైష్ణవి అనే 17 ఏళ్ల బాలిక గండికోటలో హత్యకు గురైన విషయం విదితమే. తమ కూతురు కనిపించలేదంటూ బాలిక తల్లిదండ్రులు ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో 14వ తేదీ ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు గండికోటలోని రంగనాథస్వామి ఆలయం వెనుకవైపు మరుసటి రోజు బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

లోకేష్‌ను అనుమానించి...

బాలికను ప్రొద్దుటూరు నుంచి లోకేష్‌ అనే యువకుడు ఈనెల 14వతేదీ సోమవారం ఉదయం గండికోటకు బైక్‌పైన తీసుకువచ్చాడు. తిరిగి రెండు గంటల తర్వాత బైక్‌పైన ఒక్కడే వెళ్లిపోయాడు. హత్యచేసింది లోకేష్‌గానే మొదట పోలీసులు భావించారు. తర్వాత పోలీసులు గండికోట ప్రాంతంలో పూర్తిగా విచారించడంతో పాటు సీసీ కెమెరాలను పరిశీలించారు. లోకేష్‌ వెళ్లిపోయిన తర్వాత కూడా బాలిక గండికోటలో సంచరించిందనే నిర్ధారణకు వచ్చారు. దీంతో లోకేష్‌ పాత్ర లేదని పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో హత్య కేసు మృతురాలి కుటుంబ సభ్యుల వైపు మళ్లింది.

సురేంద్ర ప్రవేశంతోనే..

బాలికకు సంబంధించిన ప్రేమ వ్యవహారాన్ని పెద్దనాన్న కుమారుడైన సురేంద్రనే డీల్‌ చేస్తూ వచ్చాడు. అతను లోకేష్‌ను అనేక సార్లు మందలించాడు. అయితే 14వతేదీన బాలిక కాలేజికి రాలేదని యాజమాన్యం తల్లికి ఫోన్‌ చేయడంతో ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు. బాలిక స్నేహితులు గండికోటకు వెళుతున్నట్లు తమతో చెప్పిందని సురేంద్రకు తెలపడంతో లోకేష్‌తో వెళ్లిందని నిర్ధారణకు వచ్చారు. వెంటనే సురేంద్ర గండికోటకు వచ్చి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

అక్కడ ఏం జరిగింది..

విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు.. సోమవారం బాలిక లోకేష్‌తో గండికోటకు వెళ్లింది. తనకోసం వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న లోకేష్‌ బాలికను అక్కడే వదిలేసి ఉదయం 10:40 నిమిషాలకు గండికోటనుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత సురేంద్ర గండికోటకు వెళ్లాడు. బాలిక కోసం గండికోటలో వెతుకుతున్న అతనికి ఆమె రంగనాథస్వామి ఆలయం సమీపంలో కనిపించింది. తన కోసమే వస్తున్నాడని భావించి ఆమె పరుగులు తీసింది. ఆ సమయంలో ఆమె కాలికి ఉన్న చెప్పులు రెండు చోట్ల పడిపోయాయి. రంగనాథస్వామి ఆలయం వెనుకవైపు బాలికను చిక్కించుకుని తీవ్రంగా కొట్టడంతో కాలేయం దెబ్బతిని మరణించింది. బాలిక హత్యను లోకేష్‌ వైపు మళ్లించడం కోసం ఆమె శరీరంపై ఉన్న పంజాబీ డ్రస్సును తొలగించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మీద బాలిక హత్య కేసులో కుటుంబ సభ్యులపైనే బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమార్తె చనిపోయిందన్న బాధ వారిలో ఏ కోశానా లేదని, పైగా హత్య జరిగిన ప్రదేశాన్ని మొదట వారే గుర్తించి తమకు తెలపడం, సురేంద్ర గండికోటలో పర్యటించిన సమయంలోనే ఈ హత్య జరిగినట్లు తేలడం.. ఈ అన్ని కారణాల రీత్యా కుటుంబ సభ్యుల ప్రమేయం ఇందులో ఉందనే నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు సోమవారం కుటుంబ సభ్యులను జమ్మలమడుగులోని పోలీసు స్టేషన్‌కు విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. ఒకటి రెండు రోజుల్లో నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వీడనున్న బాలిక హత్య మిస్టరీ!

అన్ని కోణాల్లో దర్యాప్తు

నేడో రేపో నిందితుల వివరాలు వెల్లడించనున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement