
విద్యార్థి ఆచూకీ లభ్యం
బి.కొత్తకోట : ఫోన్ మాట్లాడొద్దు అన్నందుకు తండ్రిపై అలిగి అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ సోమవారం లభ్యమైంది. స్థానిక బీసీ కాలనీకి చెందిన వెంకట్రాది కుమార్తె మేఘన (19) ఆదివారం అదృశ్యమైంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టగా మేఘన తిరుపతిలోని పెద్దమ్మ ఇంటిలో ఉన్నట్టు గుర్తించి ఇక్కడికి తీసుకొచ్చారు. తహసీల్దార్ బావాజాన్ ఎదుట హాజరుపర్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా తనకు పెళ్లి చేస్తారని అందుకే పెద్దమ్మ ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉండాలనుకొన్నట్టు మేఘన పోలీసులకు తెలిపింది.
అదుపు తప్పి వడ్ల లారీ బోల్తా
చిన్నమండెం : చిన్నమండెం మండలం వండాడి క్రాస్ సమీపంలో వడ్ల లారీ అదుపు తప్పి బోల్తాపడినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. రాయచోటి నుంచి మదనపల్లెకు వడ్ల లారీ వెళ్తుండగా వండాడి గుట్ట వద్దకు రాగా అదుపు తప్పి పక్కకు ఒరిగి మామిడితోటలో బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్, క్లీనర్‌లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మహిళతో అనుచిత ప్రవర్తన
– పోలీసులకు అప్పగించిన స్థానికులు
మదనపల్లె రూరల్ : మహిళతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించిన సంఘటన సోమవారం మదనపల్లె పట్టణంలో జరిగింది. మండలంలోని కోటవారిపల్లెకు చెందిన వంశీనాయక్ (37) స్థానిక చిత్తూరు బస్టాండులో హోటల్‌లో పని చేస్తున్న ఓ మహిళతో సహజీవనం చేసేవాడు. ఇటీవల కొంత కాలంగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె అతని నుంచి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం వంశీనాయక్ సదరు మహిళ పని చేస్తున్న హోటల్ వద్దకు వచ్చి బస్టాండులో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.

విద్యార్థి ఆచూకీ లభ్యం