
ఆటోను ఢీకొన్న ప్రైవేటు కాలేజీ బస్సు
కురబలకోట/మదనపల్లె రూరల్ : ఇళ్లకు ఆటోలో వెళుతున్న ముదివేడు మోడల్ స్కూల్ విద్యార్థుల ఆటోను అంగళ్లులోని ప్రైవేటు స్కూల్ బస్సు సోమవారం సాయంత్రం ముదివేడు సమీపంలోని చిగురేవాండ్లపల్లె దగ్గర ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో వెళుతున్న మోడల్ స్కూల్ విద్యార్థులు నల్లగుట్లపల్లెకు చెందిన కేశవ (13), అమృత (12), మంజుల (12), ఆర్సీ కురవపల్లెకు చెందిన శివమణి (16), ఎన్. పల్లవి (15), గడ్డెత్తుపల్లెకు చెందిన యశ్వంత్ (11), లహరి (13), హర్షవర్దఽన్ (14) గాయపడ్డారు. ఆటోలో 11 మంది వెళుతుండగా సంఘటన జరిగింది. హుటాహుటిన వీరిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పినట్లు డాక్టర్లు తెలిపారు. నల్లగుట్లపల్లె, ఆర్సీ కురవపల్లె, గడ్డెత్తుపల్లె పరిసర ప్రాంతాల్లోని మోడల్ స్కూల్ విద్యార్థులు ఏడు నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు ప్రతి రోజు ఆటోలో రాకపోకలు సాగిస్తున్నారు. రోజు లాగే సోమవారం సాయంత్రం ఇంటికి ఆటోలో వెళుతుండగా చిగురేవారిపల్లె వద్ద ఎదురుగా వచ్చిన ప్రైవేటు బస్సు వేగంగా ఆటోను ఢీకొన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ పరిస్థితిని పర్యవేక్షించారు. ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ కాలేజీ బస్సు, ఆటోలను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. చిగురేవారిపల్లె వద్ద తాగు నీటి బోరు వేస్తుండగా దుమ్ము ఎక్కువగా రావడంతో ఈ సంఘటన జరిగినట్లు స్థానికుల కథనం. డిప్యూటీ డీఈఓ ద్వారకనాఽథ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ యోజన గాంధీ విద్యార్థులను పరామర్శించారు.
ఎనిమిదిమంది విద్యార్థులకు గాయాలు