
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 21వ తేదిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని తెలిపారు.
జేఎన్‌టీయూ
హాస్టల్ పరిశీలన
కలికిరి: కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల బాలికల హాస్టల్‌లో శనివారం ఉదయం విద్యార్థినుల అల్పాహారంలో బల్లి పడి ఘటనకు సంబంధించి స్పందించిన మండలంలోని మేడికుర్తి పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఆదివారం కళాశాలకు చేరుకుని బాలికల మెస్‌ను తనిఖీ చేశారు. అయితే బాలికల ప్లేటులో మాత్రమే బల్లి పడిందని, సాంబారులో పడలేదని మెస్ నిర్వాహకులు వారికి తెలిపారు. మెస్ గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎలాంటి అపరిశుభ్రతకు తావులేకుండా నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సుధాకర్, హెచ్‌ఎ షఫీ, సిబ్బంది జగన్‌మోహన్, మాధవి, హాస్టల్ వార్డెన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరుచుకోవాలి
రాజంపేట టౌన్: విద్యార్థులు ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని అలవరుచుకుంటే చదువులో రాణించగలరని ప్రేమ్‌చంద్ హిందీభవన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.సర్తాజ్ హుస్సేన్ తెలిపారు. ఈనెల 31వ తేదీ ప్రముఖ హిందీ నవలాకారుడు ప్రేమ్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక బీవీఎన్ పాఠశాలలో విద్యార్థులకు ప్రేమ్‌చంద్‌కి జీవని అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా సర్తాజ్ హుస్సేన్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి పోటీ పరీక్షల్లో పాల్గొనాలన్నారు. అప్పుడే తమలోని ప్రతిభ ఏమిటన్నది తెలుస్తుందన్నారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 31వ తేదీ ప్రేమ్‌చంద్ జయంతి రోజున బహుమతులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయులు చాంద్‌బాషా, రాజశేఖర్, సైరాభాను తదితరులు పాల్గొన్నారు.

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక