చంద్రబాబు సర్కారుపై 'సమరభేరి' | YSRCP Samara Bheri On Chandrababu Govt about DSC Issue | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కారుపై 'సమరభేరి'

Jun 2 2026 5:06 AM | Updated on Jun 2 2026 6:08 AM

YSRCP Samara Bheri On Chandrababu Govt about DSC Issue

విజయనగరంలో నిరసన తెలుపుతున్న బొత్స అనూష, డీఎస్సీ అభ్యర్థులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

‘డీఎస్సీ’ అక్రమాలపై కదంతొక్కిన యువతరం   

ఉపాధ్యాయ అభ్యర్థుల ఉక్కుపిడికిలి  

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి  

వినూత్న ప్రదర్శనలతో దద్దరిల్లిన రాష్ట్రం  

అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌  

మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని యువగర్జన  

పేపర్‌ లీక్, స్పోర్ట్స్‌ కోటాలో పోస్టులు అమ్ముకోవడంపై ఆగ్రహం

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: డీఎస్సీ నియామకాల్లో అక్రమా­లపై సమరభేరి మోగింది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం యువతరం కదంతొక్కింది. చంద్రబాబు సర్కా­రుపై గళమెత్తి గర్జించింది. వినూత్న నిరసనలు, ప్రదర్శనలతో రణన్నినాదమై రగిలింది. డీఎస్సీ పేపర్‌ లీక్, అడుగడుగునా చోటు­చేసుకున్న అవకతవకలు స్పోర్ట్స్‌ కోటా పోస్టుల అమ్మకంపై దుమ్మెత్తిపోసింది. మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. తక్షణం అర్హులకు న్యాయం చేయాలని, లేకుంటే మెగా డీఎస్సీ పేరు­తో దగా చేసిన చంద్రబాబు సర్కారుకు ఘోరీ ఖాయ­మని ధ్వజమెత్తింది. ప్రతిభకు పాతరేయడం, రిజ­ర్వే­షన్లకు గండికొట్టడంపై భగ్గుమంది. కాసులిచ్చి­న వారికే పోస్టులు దక్కడంపై మండిపడింది. తక్షణం సీబీఐ విచారణ జరపాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నినదించింది. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నేతలు, వైఎస్సార్‌ సీపీ నాయకులు కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతి­పత్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 


గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని గుర్తుచేశారు. ముందే మెరిట్‌ లిస్టు ప్రకటించి అర్హులకు వైఎస్‌ జగన్‌ ఉద్యోగాలిచ్చా­రని ప్రశంసించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనకాపల్లిలో మానవహారం చేపట్టారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ, కృష్ణాజిల్లా మచిలీపట్నంలోనూ యువత ఆందోళన చేశారు. కలెక్టర్లకు వినతిపత్రాలిచ్చారు. బందరులో పోలీ­సులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.  గుంటూరు, పల్నా­డు జిల్లా నరసరావుపేట, బాపట్లలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో యువత కదంతొక్కారు. కలెక్టరేట్ల వద్ద దర్నాలు నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు. ప్రకాశం జిల్లాల్లోనూ ఆందోళనలు జరిగాయి. 


నెల్లూరులో పోలీసులు కలెక్టరేట్‌కు తాళాలు వేశారు. ఏలూరు, పశ్చిమ­గోదావరి జిల్లా భీమవరంలోనూ యువకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ యువకులు ర్యాలీలు నిర్వహించారు.  పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ ఆందోళనలు సాగాయి.  చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద యువకులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.  తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్ర­వ­రం, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా కలెక్టరేట్లను యువకులు ముట్టడించారు.  వైఎస్సార్‌ కడప జిల్లాలో యువత బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా యువత కదంతొక్కింది. 
 

డీఎస్సీ అక్రమాల బాధ్యుల్ని శిక్షించాల్సిందే: జక్కంపూడి రాజా
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న మెగా డీఎస్సీ అడుగడు­గునా అక్రమాలు, అవకతవకలతో దగా డీఎస్సీగా మారిందని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో జరిగిన భారీ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు భారీ నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా చేసి, అధికారులకు వినతిపత్రం ఇచ్చా­రు. 

అనంతరం విశాఖ మద్దిల­పాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన అత్యంత పారదర్శకమైన డీఎస్సీ నోటిఫికేషన్‌ను అడ్డగోలుగా రద్దుచేసి, ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చిందని విమర్శించారు. ‘అర్హులకు కాకుండా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో బేరాలు కుదుర్చుకున్న వారికే కాల్‌ లెటర్లు ఇచ్చారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత స్పోర్ట్స్‌ కోటా జీవోలను ఇష్టారాజ్యంగా మార్చి తాడాట, బొంగరం ఆటలు ఆడేవారికి ఉద్యోగాలిచ్చి అర్హులైన ప్రతిభావంతులను ముంచేశారు. లోకేశ్‌ను వెంటనే కేబినెట్‌ నుంచి తప్పించి, ఈ వ్యవహారంలో ఆయన్ని ఏ–1గా చేర్చి అరెస్టు చేయాలి’ అని పేర్కొన్నారు.  వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మాట్లాడుతూ డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement