
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ఎన్నికల కార్యాలయం ఎదుట బైఠాయించి వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలను అరికట్టాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. తర్వాత.. వారికి లోపలికి అనుమతి ఇవ్వడంతో పులివెందులలో పరిస్థితులపై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇక, ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు , కైలే అనిల్ కుమార్ , ఎన్టీఆర్ జిల్లా దేవినేని అవినాష్, పూనూరు గౌతమ్ రెడ్డి, నారాయణ మూర్తి ఉన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..‘ప్రశాంతంగా ఉన్న పులివెందులను రక్త చరిత్ర పులివెందులగా మార్చారు. పులివెందుల పౌరుషానికి అమరావతి పెత్తందారులకి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రచారానికి వెళ్లిన మాపై దాడి చేశారు. మమ్మల్ని హతమార్చేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించారు. దేవుడి దయ, జగనన్న ఆశీస్సులతో నేను ప్రాణాలతో బయటపడ్డా. తాజాగా పోలింగ్ కేంద్రాలను మార్చేశారు. దోచుకున్న డబ్బును పులివెందులలో పంచుతున్నారు. మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల కమిషనర్‌ను కలిసి పరిస్థితులను వివరించాం. ఎమ్మెల్సీనైన నాకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు. టీడీపీ తరపున పోలీసులే ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు.

మాజీమంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..‘దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. ఎన్నికల కమిషన్ కళ్లుమూసుకుని నిద్ర నటిస్తోంది. నిద్రపోయేవాడిని నిద్రలేపొచ్చు. నిద్ర నటించే వారిని ఏమీ చేయలేం. ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చున్న వాళ్లే ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది. ఓటర్‌కి దూరంగా పోలింగ్ స్టేషన్లను మారుస్తున్నారు. ఎన్నికల కమిషనర్ సీట్లో కూర్చునే ముందు చేసిన ప్రమాణాలను గుర్తుచేసుకోవాలని కోరాం. కేవలం జెడ్పీటీసీ ఎన్నికల కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చంద్రబాబు కాళ్ల వద్ద పడేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపారని, రమేష యాదవను హత్య చేయాలని చూశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈసీ మొద్దు నిద్ర వీడాలని ఆయన హెచ్చరించారు.