
సాక్షి, విజయవాడ: న్యూ ఆర్‌ఆర్‌పేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. మెడికల్ క్యాంప్‌లో డయేరియా బాధితులను వైఎస్సార్‌సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై మల్లాది విష్ణు మండిపడ్డారు. గంటగంటకూ బాధితులు పెరుగుతున్నారని.. వారికి మెరుగైన వైద్యం కూడా ప్రభుత్వం అందించలేకపోతోందన్నారు.

‘‘ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికి వంద మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 30 మందికి పైగానే చికిత్స పొందుతున్నారు. అధికారులు బాధితుల సంఖ్యను తగ్గించి చెబుతున్నారు. మంచినీటి వల్లే సమస్య వచ్చిందని ప్రజలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఆహారం వల్ల అంటున్నారు. ఎలాంటి పరీక్షలు చేయకుండా నీటి వల్ల కాదని ఎలా నిర్ధారిస్తారు?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు.

‘‘మెడికల్ క్యాంప్‌కు వచ్చే వారికి సరైన వైద్యం కూడా అందించలేకపోతున్నారు. మున్సిపల్ మంత్రి వచ్చి చూసి వెళ్లిపోయారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోపోవటం వల్లే ఈ పరిస్థితి. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 48 గంటల నుంచి ఈ ప్రాంతం భయంకరమైన వాతావరణంలో ఉంటే అధికారులు మీటింగ్‌లకు పరిమితమయ్యారు.
..అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా..? పేషెంట్లను కుర్చీలో కూర్చోబెట్టి వైద్యం అందిస్తున్నారు. ప్రభుత్వం శానిటేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.