చంద్రబాబు అసమర్థ పాలనతోనే ఇంధన కొరత | YSRCP Leaders fires on Chandrababu Govt Over Petrol and Diesel Shortages: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అసమర్థ పాలనతోనే ఇంధన కొరత

Apr 28 2026 5:03 AM | Updated on Apr 28 2026 5:03 AM

YSRCP Leaders fires on Chandrababu Govt Over Petrol and Diesel Shortages: Andhra Pradesh

వెలంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, అంజద్‌ బాషా

పెట్రోల్‌ బంకుల వద్ద నోస్టాక్‌ బోర్డులు

కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు  

పెట్రోల్, డీజిల్‌ లేక వ్యవసాయ సంక్షోభం  

పబ్లిసిటీ స్టంట్‌ కాదు.. డీజిల్‌ కావాలి బాబూ.. 

మీడియాతో వైఎస్సార్‌సీపీ నేతలు వెలంపల్లి, కన్నబాబు, అంజద్‌బాషా, తాటిపర్తి  

సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్‌/కడప కార్పొరేషన్‌/యర్రగొండపాలెం: చంద్రబాబు అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ కొరత ఏర్పడిందని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఎక్కడ చూసినా పెట్రోల్‌ బంక్‌ల వద్ద నో స్టాక్‌ బోర్డులు లేదా పెట్రోల్, డీజిల్‌ కోసం కొట్లాడుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు తీరి ఉన్నాయన్నారు. రవాణా వాహనాల వారి నుంచి ఆటో సోదరుల వరకు పడిగాపులు పడుతున్నారని చెప్పారు. మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌లు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.

పబ్లిసిటీ స్టంట్‌ మాస్టర్‌ నడుపుతున్న ఈ ప్రభుత్వంలో ప్రచారం తప్ప పని కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరతతో అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌ కొరత లేదని, టీడీపీ కూటమి అధికారంలో ఉన్న ఒక్క ఏపీలో మాత్రమే ఈ దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను గుర్తించి చక్కదిద్దడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు క్యూలైన్‌ కష్టాలు తప్పడం లేదన్నారు. 

విత్తనాలు, ఎరువుల కోసం రైతులు, గ్యాస్‌ కోసం జనం క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. చీమ చిటుక్కుమంటే పబ్లిసిటీ కోసం మీడియా ముందుకొచ్చే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇండిగో విమానాలు ఆగిపోతే తనకే మాత్రం సంబంధం లేకున్నా మంత్రి లోకేశ్‌ సమీక్షించాడని ఎల్లో మీడియా ఊదరగొట్టిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇంధన కొరత గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. 

తుపాన్‌ను తప్పించానని చెప్పిన చంద్రబాబు పక్కనే ఉన్న హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్‌ నుంచి పెట్రోల్, డీజిల్‌ తెప్పించలేకపోతున్నారా?.. అంటూ ఎద్దేవా చేశారు. కాగా, మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలోని పెట్రోలు బంకుల వద్ద పరిస్థితుల్ని  ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ పరిశీలించారు. పెట్రోల్, డీజిల్‌ కోసం ప్రజలు పడుతున్న అవస్థల్ని అడిగి తెలుసుకున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement