రేపు ఉచిత పంటల బీమా చెల్లింపు | YSR Free Crop Insurance Payment Will Be Made Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ఉచిత పంటల బీమా చెల్లింపు

Dec 14 2020 9:45 PM | Updated on Dec 14 2020 10:18 PM

YSR Free Crop Insurance Payment Will Be Made Tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: ఆరుగాలం కష్టపడి తీరా పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరవు కాటకాలు, చీడపీడలు ఇతర ప్రకృతి వైపరీత్యాలతో కలిగే పంట దిగుబడి నష్టాలతో కుదేలవుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కొండంత అండలా నిలుస్తోంది. సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు, కడగండ్లు స్వయంగా చూసిన సీఎం వైఎస్‌‌ జగన్, ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఆ మేరకు రైతులను ఆదుకునే విధంగా ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా’ పథకాన్ని అమలు చేస్తున్నారు.

2019 సీజన్‌లో పలు కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం వారికి బీమా పరిహారం అందజేస్తోంది. అందులో భాగంగా రేపు (మంగళవారం) 9.48 లక్షల రైతులకు ఏకంగా  రూ.1252 కోట్ల పరిహారం అందుతోంది. క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. 

ఇప్పటికే ఒక పరిహారం:
2018–19 రబీ పంటల బీమా ప్రీమియంకు సంబంధించి అప్పటి ప్రభుత్వం బకాయి పడిన రూ.122.61 కోట్లు చెల్లించిన ఈ ప్రభుత్వం, నాటి పంటల నష్టానికి సంబంధించి బీమా కంపెనీల నుంచి క్లెయిమ్‌లు వచ్చేలా చేసింది. ఆ మేరకు ఈ ఏడాది జూన్‌ 26న, బీమా కంపెనీలు రాష్ట్రంలో 5.94 లక్షల రైతులకు రూ.596.36 కోట్ల క్లెయిమ్స్‌ విడుదల చేశాయి. ఆనాడు కూడా క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన సీఎం వైఎస్‌‌ జగన్, రైతుల ఖాతాల్లో నేరుగా ఆ బీమా పరిహారం జమ చేశారు.

పైసా కూడా భారం లేకుండా:
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది. భూమి సాగు చేస్తూ, ఈ–క్రాప్‌లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి, రైతుల తరపున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది.

పూర్తి పారదర్శకత:
గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలను వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ–క్రాప్‌లో నమోదు చేసి బీమా సదుపాయం కల్పించడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ వివరాలు అంచనా వేసి, బీమా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, పథకంలో లబ్ధిదారులైన (అర్హులైన) రైతుల జాబితాలను, పూర్తి వివరాలతో గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. 

ప్రభుత్వం–ప్రీమియం:
2019 సీజన్‌లో పంటల బీమా కింద రైతులు కట్టాల్సిన రూ.468 కోట్ల ప్రీమియమ్‌తో పాటు, ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన రూ.503 కోట్లు కూడా కడుతూ, మొత్తం రూ.971 కోట్ల ప్రీమియమ్‌ను ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించింది. 

గత ప్రభుత్వ హయాంలో..:
రైతుల పంటల బీమా కోసం ప్రీమియంగా గత ప్రభుత్వం తన వాటాగా ఏడాదికి కేవలం రూ.393 కోట్ల ప్రీమియమ్‌ మాత్రమే చెల్లించింది. అదే ఈ ప్రభుత్వం గత ఏడాది (2019)కి సంబంధించి ఏకంగా రూ.971.23 కోట్ల ప్రీమియం చెల్లించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement