ప్రజారక్షణలో మెరిసి.. అవార్డులతో మురిసి | YSR District Police Won 8 Awards Since 2020 | Sakshi
Sakshi News home page

ప్రజారక్షణలో మెరిసి.. అవార్డులతో మురిసి

Published Tue, Sep 20 2022 10:58 AM | Last Updated on Tue, Sep 20 2022 2:01 PM

YSR District Police Won 8 Awards Since 2020 - Sakshi

కడప అర్బన్‌ :  ప్రజారక్షణకు కృషి చేస్తున్న వైఎస్సార్‌ జిల్లా పోలీసులకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2020 నుంచి ఇప్పటి (2022) దాకా ప్రతిషాత్మక అవార్డులను దక్కించుకుని ప్రత్యేకత చాటారు. దిశయాప్‌ డౌన్‌లోడ్‌ చేయించడం, వియోగించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రతి పట్టణంలో కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థలో అంతర్భాగంగా బ్లూకోట్‌ సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు.మహిళా పోలీసు వెన్నుదన్నుగా నిలిచి గ్రామీణ, వార్ఢుస్థాయి సమాచారాలను చేరవేస్తూ నేరాల నియంత్రణకు తమవంతు కృషి చేస్తున్నారు. వీరి పనితీరుకు, పరిజ్ఞానానికి నిదర్శనంగా అవార్డులు లభించాయి.విధుల్లో మరింత భాద్యతను పెంచాయి.   

ఈ ఏడాది ఫిబ్రవరి 24న జాతీయస్థాయిలో జిల్లా పోలీసుశాఖ కీర్తిపతాక ఎగురవేసింది. పలు ప్రభుత్వ సంస్థలతో పోటీపడి డిజిటల్‌ విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు ఇచ్చే “డిజిటల్‌ టెక్నాలజీ సభ’అవార్డును సొంతం చేసుకుంది.  టెక్‌ సపోర్ట్‌ ఆన్‌వన్‌ క్లిక్‌ వెబ్‌సైట్‌ ద్వారా పోలీస్‌ అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణలో అవసరమైన డాష్‌ బోర్డ్‌లో డేటాను పొందుపర్చే విధానాన్ని ఐటీ కోర్‌ టీం సిబ్బంది సులభతరం చేశారు. వర్చువల్‌ సెమినార్‌ ద్వారా ఈ పురస్కారాన్ని జిల్లా ఎస్పీ  అన్బురాజన్‌ అందుకున్నారు.   

ఈ ఏడాది ఆగస్టు 20న జిల్లా పోలీస్‌శాఖ సిగలో మరో కలికితురాయి చేరింది. దేశ వ్యాప్తంగా పోలీస్‌శాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘స్కోచ్‌’అవార్డుకు ఎంపికైంది. ‘దిశ టాస్క్‌ ట్రాకర్‌’మల్టీ టాస్క్‌ అప్లికేషన్‌కు అవార్డు దక్కింది. అప్లికేషన్‌ను జిల్లా పోలీస్‌శాఖ ఐటీ కోర్‌ టీం సిబ్బంది రూపొందించారు. ఇందులో భాగస్వామ్యులైన మహిళాపోలీసులు, ఐటీ కోర్‌ టీమ్‌ జిల్లా ఎస్పీ ప్రశంసలందుకున్నారు. సృజనాత్మక అప్లికేషన్‌ రూపొందించినందుకు జిల్లా ఎస్పీని, రాష్ట్ర డీజీపీ కే.వీ. రాజేంద్రనాథ్‌రెడ్డి అభినందించారు.  

‘స్కోచ్‌ గ్రూప్‌’వారి నుంచి జిల్లా పోలీస్‌శాఖకు 2020 అక్టోబర్‌ 28న టెలీమెడిసిన్, అవేర్‌ అండ్‌ అవేక్‌ పబ్లిక్‌ త్రో సోషల్‌ మీడియా, 2021 నవంబర్‌లో 16న ఐఎస్‌ఏఆర్‌సీ, టెక్‌ సపోర్ట్‌ ఆన్‌ ఒన్‌ క్లిక్‌  ప్రాజెక్ట్‌లకు అవారు ఇచ్చారు.  

టెలీమెడిసిన్‌ ప్రాజెక్ట్‌కుగాను 2020 అక్టోబర్‌ 28న స్కోచ్‌ గ్రూప్‌ వారు, 29న గవర్నెన్స్‌ నౌ ఇండియా పోలీస్‌ అవార్డ్స్‌–   జిల్లా పోలీస్‌శాఖ దక్కించుకుంది.   
ఐఎస్‌ఏఆర్‌సీ ప్రాజెక్ట్‌కుగాను 2021 నవంబర్‌ 16న స్కోచ్‌ గ్రూప్‌ వారు, ఈ ఏడాది ఆగస్టు 27న గవర్నెన్స్‌ నౌ ఇండియా పోలీస్‌ అవార్డ్స్‌–2022 అనే రెండు అవార్డులు దక్కాయి. జిల్లా పోలీసుశాఖలో కడప, ప్రొద్దుటూరులో ఐఎస్‌ఏఆర్‌సీ ద్వారా జిల్లా వ్యాప్తంగా 8 కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థలుగా రూపొందాయి. బాధితుల వద్దకు నేరుగా చేరుకుని వారి సమస్యలను పరిష్కరిస్తారు. ‘దిశ’పెట్రోలింగ్‌ వాహనాలను కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేయడం ద్వారా మహిళలు ఆపదలో ఉన్న సమయంలో డయల్‌ 100, ‘దిశ’ఎస్‌ఓఎస్‌ క్లిక్‌ చేయగానే వెంటనే బ్లూకోట్‌ లేదా రక్షక్‌ సిబ్బంది, మహిళా పోలీసువారు సంఘటన స్థలానికి చేరుకుంటారు. బాధిత మహిళకు భరోసా కల్పిస్తారు.

లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేశారు. జిల్లా పోలీసుశాఖకు ఈ ఏడాది ఆగస్టు 31న జాతీయస్థాయిలో అరుదైన గౌరవం లభించింది. గత ఏడాది నవంబర్‌లో ఉమ్మడి జిల్లాలోని వీరబల్లిలో నమోదైన సైబర్‌ కేసును ఛేదించి బాధితుడు కోల్పోయిన రూ. 2.8 లక్షల మొత్తాన్ని అంతర్‌రాష్ట్ర సైబర్‌ నేరగాడి నుంచి రికవరీ చేశారు.న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఎన్‌సీఆర్‌బీ వర్క్‌షాపులో ఏపీ నుంచి వైఎస్పార్‌ జిల్లాకు చెందిన సైబర్‌కేసును కేస్‌ స్టడీకి ఎంపిక చేసి జిల్లా ఎస్పీని ప్రసంగించేందుకు ఆహా్వనించింది. అదనపు ఎస్పీ (అడ్మిన్‌) తుషార్‌ డూడీ వర్క్‌షాప్‌నకు హాజరై కేసు ఛేదనలో ఎదుర్కొన్న అనుభవాలను పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు.  కార్యక్రమంలో నిర్వాహకులు డూడికీ జ్ఞాపికను అందజేశారు.  

అవార్డులు బాధ్యత పెంచాయి
జిల్లాలో పోలీసు అధికారుల, సిబ్బంది, ప్రజలందరి సహకారంతో 2020 నుంచి ఇప్పటి వరకు వివిధ కేటగిరీల్లో 8 రకాల అవార్డులు వచ్చాయి. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో విధులను నిర్వహించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాంతిభద్రతల పరిరక్షణలో సఫలీకృతులవుతున్నాం. ప్రధానంగా ‘దిశ’యాప్‌ వినియోగం, కేసుల పరిష్కారంలో జిల్లా పోలీసు యంత్రాంగంలో ఐటీ కోర్‌ టీమ్‌ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ అవార్డులు   పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతను మరింత పెంచాయి. 
– కేకేఎన్‌ అన్బురాజన్, జిల్లా ఎస్పీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement