
సాక్షి, అనంతపురం: ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్యూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు.

అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. వర్షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదు.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేది. మన వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతీ రైతుకు న్యాయం చేశాం. అరటి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నంబర్ వన్ స్థానంలో ఉంది. మా ప్రభుత్వంలో రూ.25కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు కూడా వాడుకోలేకపోతున్నారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తాం’ అని రైతులకు హామీ ఇచ్చారు.
అకాల వర్షానికి భారీ నష్టం..
శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.

అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి.