దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు మావిగన్ కారిడార్‌తో తొలిరోజు నుంచే రాజధాని
తన పనులతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్న చంద్రబాబు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పునరుద్ఘాటన
మావిగన్‌లో కేవలం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలు
అదే ప్రాంతంలో పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, 110 కి.మీ మేర జాతీయ రహదారులు ఉన్నాయి
ఫలితంగా రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.. అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ కోసమే రూ.2 లక్షల కోట్లు కావాలి
ఆ పనులు పూర్తయ్యే సరికి ఎన్నేళ్లు? ఎన్ని దశాబ్దాలు పడుతుందో?
అప్పటికి ఆ నిర్మాణ వ్యయం ఎంతకు పెరుగుతుంది?
తద్వారా రాజధాని రుణాలు ఇంకెంత పెరుగుతాయి?
అసలు రాజధాని అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది?
మావిగన్‌కు ససేమిరా అంటున్న చంద్రబాబు
ఎందుకంటే అమరావతిలో కాంట్రాక్ట్‌లు, మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు, కమీషన్లు
ఈనాడు కిరణ్ వియ్యంకుడికి చెందిన ఆర్‌వీఆర్ సంస్థ, బలుసు శ్రీనివాస్‌కు చెందిన బీఎస్‌ఆర్ సంస్థలకే పనులు
ఆ రెండు సంస్థలకే వేల కోట్ల కాంట్రాక్ట్‌లు.. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్
అంతా కలిసి దోచుకో.. పంచుకో.. తినుకో.. అదే డీపీటీ.. అందుకే వైఎస్సార్‌సీపీపై ఆక్రోశం..
ఓర్చుకోలేక గతితప్పిన ఏబీఎన్ రాధాకృష్ణ
మన వారి ఇళ్లలో మహిళలపైనా అసభ్య పదజాలం.. అధికారంలోకి వచ్చాక రాధాకృష్ణకు గట్టిగా బుద్ధి చెబుతాం
బాబు ప్రభుత్వం అన్నింటా దారుణ వైఫల్యం
రెండేళ్లు కూడా గడవక ముందే ఏకంగా రూ.3.52 లక్షల కోట్ల అప్పులు
అయినా అన్ని రంగాలు నిర్వీర్యం.. విద్య, వైద్యం, వ్యవసాయం దయనీయం
ఉద్యోగులకు బకాయిలు, ఐఆర్, డీఏలు ఇవ్వరు.. పీఆర్‌సీ వేయరు.. మరి తెచ్చిన అప్పు అంతా ఎక్కడికి పోతోంది? ఎవరి జేబుల్లోకి వెళుతోంది?
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు
అందులో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా బదిలీ.. ఆధార్‌తో సహా ఆ అక్కచెల్లెమ్మల పూర్తి వివరాలు చెప్పగలం
ఎప్పుడు ఎన్నికలొచ్చినా మనదే ఘన విజయం
చంద్రబాబు గారూ.. మీ చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తున్నారు. అమరావతి అని మీరు రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారు. అక్కడ రోడ్లు, కరెంట్, డ్రైనేజీ, నీళ్ల వంటి బేసిక్ వసతులు కల్పించడానికే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని నీ అంతట నువ్వే సెంట్రల్ గవర్నమెంట్‌కు, బ్యాంకులకు డీపీఆర్‌లు ఇచ్చావు. మరోవైపు లక్ష ఎకరాల్లో అమరావతి అని చెబుతున్నావు. ఈ లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లతో నీవు నిరంతరం రోడ్లు వేయడం, కరెంట్ ఇవ్వడం, డ్రైనేజీ పనులు చేస్తూనే ఉంటావు. నిరంతరం నీళ్లు ఇచ్చేందుకే అవస్థలు పడుతుంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అందుకే చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్‌గా 10 శాతం ఖర్చుతో ‘మావిగన్’ను సూచించాం.
కూటమి పాలనలో సగం టర్మ్ అయిపోయింది. అన్ని రంగాల్లోనూ ఘోర వైఫల్యం. అంతటా అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలు. మిగిలింది ఇంకో సగం టర్మ్ మాత్రమే. ఇంకో ఏడాది దాటితే, రేపటి సంవత్సరం వచ్చేసరికి నా పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నేను రోడ్డు మీదకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాను. పాదయాత్ర మొదలైన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తాం.
దోచుకునేది.. పంచుకునేది.. తినుకునేది కట్ అయిపోతుందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగబాధ పడిపోతున్నాడు. వైఎస్సార్‌సీపీ శ్రేణులందరిపై అన్యాయమైన, దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఇదే రాధాకృష్ణకు చెబుతున్నా.. నువ్వన్న మాటలకు రేప్పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతాం. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తోందా రాధాకృష్ణా?
వారికైనా భార్యలు ఉంటారు. వాళ్ల భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా అలా మాట్లాడితే వారికి నచ్చుతుందా? ఎవరికీ నచ్చదు. నచ్చనప్పుడు కనీసం అలాంటి మాటలు మాట్లాడటం తప్పు అని ఈ నాయకులైనా చెప్పాలి కదా? ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు. ఈ లోకేశ్ చెప్పడు. ఈ దత్త పుత్రుడు చెప్పడు. సిగ్గు లేకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాటలు మాట్లాడితే.. వాటిని సమర్థిస్తారు. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోయాయి. ఈ రోజు సోషల్ మీడియాలో అప్పుడెప్పుడో కామెంట్లు పెట్టిన పిల్లలను తీసుకువచ్చి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. జైళ్లలో పెడుతున్నారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. కొడుతున్నారు. రేప్పొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కూడా ఇదే జరుగుతుంది. మహిళలను తక్కువగా చూసే.. తక్కువగా మాట్లాడే పరిస్థితులు ఎందుకొచ్చాయి?
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్’ సూచించామని, దాని వల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణ భారం పడదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ‘మావిగన్ కారిడార్’తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుందన్నారు. కేవలం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలని.. ఆ ప్రాంతంలో పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో పాటు 110 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉన్నందున రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ లాంటి కనీస మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు.
అమరావతిలో ఆ పనులు పూర్తయ్యే సరికి ఎన్నో ఏళ్లు, దశాబ్దాలు పడుతుందన్నారు. అప్పటికి నిర్మాణ వ్యయం ఎంతకు పెరుగుతుందని.. దాని వల్ల రాజధాని రుణాలు ఇంకెంత పెరుగుతాయని.. అసలు రాజధాని ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు తన పనులతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని.. అందుకే ప్లాన్ బి కింద మావిగన్ ప్రతిపాదించామని చెప్పారు. అయితే దీని వల్ల అమరావతిలో తమ అవినీతి కోటలు బద్దలవుతాయని చంద్రబాబు ఒప్పుకోవడం లేదన్నారు. మరోవైపు ఓర్చుకోలేక రెచ్చిపోతున్న ఏబీఎన్ రాధాకృష్ణ గతి తప్పి మన పార్టీ నాయకులపై విమర్శలు చేశారని, ఇళ్లలోని మహిళలపైనా అసభ్య పదజాలం ఉపయోగించారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చాక గట్టిగా బుద్ధి చెబుతామని.. ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
మావిగన్.. మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్
‘‘చంద్రబాబు తన చర్యలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు. ‘మావిగన్’. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబు గారూ.. మీ చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తున్నారు. అమరావతి అని మీరు రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజీ వ్యవస్థ, నీళ్లు వంటి బేసిక్ వసతులు కల్పించడానికే నీ అంతట నువ్వే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్‌కు, బ్యాంకులకు డీపీఆర్‌లు ఇచ్చావు. ఈ లెక్కన 50 వేల ఎకరాలకే రూ.లక్ష కోట్లకు దిక్కులేదు అనుకుంటే మరో 50 వేల ఎకరాలు అని చెప్పి మళ్లీ భూ సమీకరణ చేపడుతూ.. లక్ష ఎకరాల అమరావతి అని చెబుతున్నావు.
ఈ లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లతో నీవు నిరంతరం రోడ్లు వేయడం, కరెంట్ ఇవ్వడం, డ్రైనేజీ పనులు చేసూ్తనే ఉంటావు. నిరంతరం నీళ్లు ఇచ్చేందుకే అవస్థలు పడుతుంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్లు గడిచాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఏమీ లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లు, కరెంట్, డ్రైనేజీ, నీళ్లకే ఖర్చు అవుతుంది. ఆ రెండు లక్షల కోట్ల విలువ దశాబ్దాలకు రూ.4 లక్షల కోట్లు అవుతుందో, ఇంకా ఎంత అవుతుందో తెలియదు. చివరికి 12 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుంది. అయ్యా చంద్రబాబూ.. ఇది మానుకో. ఆ రెండు లక్షల కోట్లలో 10 శాతం ఖర్చు చేస్తే చాలు మావిగన్‌తో మంచి రాజధాని తక్షణమే అందుబాటులోకి వస్తుంది.
ప్లాన్–ఏ వద్దన్నారు.. ప్లాన్–బీ ఎందుకు ఆలోచించడం లేదు?
ప్లాన్–ఏ వద్దన్నారు సరే.. మరి ప్లాన్–బీపై ఎందుకు ఆలోచన చేయడం లేదు? నేను ఇంతకు ముందు రాజధాని విషయంలో మంచి ఆలోచన చెప్పాను. ప్లాన్–ఏ కింద రాష్ట్రంలో అన్నింటి కన్నా పెద్ద నగరం విశాఖపట్నం. అందులో కార్యనిర్వాహక రాజధాని పెడితే ఎలాంటి ఖర్చు అవసరం ఉండదు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం అప్పట్లో మనం కర్నూలుకు మాటిచ్చాం. అది నెరవేర్చుతూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ, ఇక్కడే అమరావతిలో శాసన రాజధాని తీసుకువస్తే బాగుంటుందయ్యా అని చెబితే.. నానాయాగీ చేసి, రాజకీయాలు చేసి అవి వద్దు అన్నారు. సరే పోనీ అనుకుంటే ఈ ప్రాంతంలో నీవు చేసే పనికి రాజధాని లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా ప్లాన్–బీ కింద మావిగన్ ప్రతిపాదన తెచ్చాం.
10 శాతం ఖర్చు చేస్తే ఇక్కడే బ్రహ్మాండమైన రాజధాని
మచిలీపట్నంలో పోర్టు కట్టింది నీవు కాదు చంద్రబాబూ.. మేం కట్టాం. వైఎస్సార్‌ర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పోర్టుకు భూ సేకరణ చేపట్టాం. మా హయాంలోనే అనుమతులు తీసుకువచ్చాం. మా హయాంలోనే ఫైనాన్షియల్ క్లోజర్ చేశాం. అప్పట్లోనే బ్యాంకులతో నీట్‌గా టై అప్ చేసి 30–40 శాతం వర్క్ కూడా పూర్తి చేశాం. ఆ పోర్టు పూర్తవుతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడకు 70 కిలోమీటర్లు.. విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు. మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉంది. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉంది. మచిలీపట్నంలో పోర్టు వస్తుంది.
ఈ హైవేకు అటూ ఇటుగా అమరావతిలో కట్టే బిల్డింగ్‌లు ఇక్కడ కడితే బాగుంటుంది. మచిలీపట్నం నుంచి (మా), విజయవాడ నుంచి (వి), గుంటూరు నుంచి (గన్) అంటూ మావిగన్ ప్రతిపాదన చేశాం. ఈ 110 కిలోమీటర్ల ఎకనావిుక్ కారిడార్‌ను కేపిటల్ కారిడార్‌గా డిక్లేర్ చేసి, ఆ కట్టే బిల్డింగ్‌లు ఇక్కడ కట్టండి. రూ.రెండు లక్షల కోట్లలో 10 శాతం ఇక్కడ ఖర్చు చేసి రోడ్లకు కనెక్టివిటీ ఇస్తే చాలు.. బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారు అవుతుంది. డే వన్ నుంచే రాజధాని వస్తుంది. ఒక గ్రోత్ ఇంజన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ల తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండదు. మావిగన్‌లోనే ఉద్యోగాలు దొరుకుతాయి అని చిలుకకు చెప్పినట్లు చెప్పినా, చంద్రబాబు ఒప్పుకోవడం లేదు.
జగన్ ఏం చెప్పినా ససేమిరా..
మనమంత బాగా, లౌక్యంగా చెప్పినా ఊహూ అంటున్నాడు. ఎందుకు అహం? ఎందుకు వద్దంటున్నారంటే.. కారణం అక్కడ రూ.రెండు లక్షల కోట్లలో మొబిలైజేషన్ వర్కుల పేరుతో 8 శాతం కమీషన్లు తీసుకోవచ్చు. మావిగన్‌లో ఈ ఆదాయాలు ఉండవు కదా.. కాబట్టి మావిగన్ వద్దు. అమరావతిలో అన్నీ స్కామ్‌లే. ఇక్కడ కాంట్రాక్టర్లు ఎవరంటే ఒకరు ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయలరఘు (ఆర్‌జీవీ), ఇంకొకరు బీఎస్‌ఆర్ (బలుసు శ్రీనివాసరావు). వీరు చంద్రబాబు బినావీులు. వారి సంస్థలకు కాంట్రాక్ట్‌లు. వీళ్లకు కొత్తగా మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్సులు. అమరావతి కాంట్రాక్టర్లు అంతా వీళ్లే. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకనే మావిగన్ అంటే అహం.. వైఎస్ జగన్ ఏం చెప్పినా ఊహూ అంటున్నారు.
చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
⇒ జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఇస్తాను.. ఇంకా అవి కాకుండా అంతకు మించి సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు కూడా ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. కానీ, ఈ రోజు బిర్యానీ పెట్టలేదు.. ఉన్న పలావు కూడా పోయిందని ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, మన పథకాలన్నీ కూడా రద్దయిపోయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోవడం కనిపిస్తోంది.
⇒ విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్, సంక్షేమం, అభివృద్ధి.. ఇవన్నీ ఈరోజు తిరోగమనంలో కనిపిస్తున్నాయి. ఎక్కడా పలాన మంచి చేశామనే చెప్పే పరిస్థితి లేదు. మన ఐదేళ్ల పాలనలో మనం రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా మీ జగన్ బటన్లు నొక్కడం ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోవడం చూశాం. ఆ రూ.2.73 లక్షల కోట్లు ఎవరి అకౌంట్లలోకి పోయాయి.. వారి ఆధార్ నంబర్లు సహా జమా ఖర్చు కూడా ఇవ్వగలుగుతాం.
⇒ కానీ ఇదే చంద్రబాబు రెండు సంవత్సరాలు కూడా తిరక్క ముందే రూ.3.52 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి ఈ అప్పు అంతా ఏమైంది? ప్రజల ఖాతాల్లోకి ఎందుకు రావడం లేదు? ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది? ఎవరి జేబుల్లోకి పోతోంది? అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే. 
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నేతలు, ముఖ్య కార్యకర్తలు
ఏం జరిగినా రైతులను ఆదుకునే నాథుడు లేడు
⇒ కూటమి పాలనలో ఏ రైతుకూ గిట్టుబాటు ధర రావడం లేదు. అంతటా దళారీల వ్యవస్థ. మన హయాంలో ఆర్బీకే, – ఈ క్రాప్, సీఎం యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్) పెట్టి మద్దతు ధరలకు పంటలు కొనుగోలు చేసే వాళ్లం. ఆ రకంగా రూ.7,800 కోట్లు ఖర్చు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చిన పరిస్థితి. నేడు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు.
⇒ రైతులకు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. రైతులకు కరువొచ్చినా, తుపాన్ వచ్చినా ఆదుకునే నాథుడు లేడు. వాళ్ల ఖర్మకు వదిలేసిన పరిస్థితి. సీజన్ ముగిసేలోపు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి, మరుసటి సీజన్‌కి రైతును సన్నద్ధం చేసేవాళ్లం. ఈరోజు ఇన్‌పుట్ సబ్సిడీ గురించి మాట్లాడేవాడే లేడు. ఆక్వాదీ అదే పరిస్థితి.
ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం
⇒ చదువుల పరిస్థితి ఇంకా ఘోరం. మన ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేసే వాళ్లం. విద్యాదీవెన, వసతి దీవెన డబ్బులు క్రమం తప్పకుండా ఇచ్చే వాళ్లం. ఇప్పటికే రూ.7 వేల కోట్లకుపైగా బకాయిలున్నాయి. ఈ ఏడాది చేయాల్సిన చెల్లింపులు మరో రూ.2,600 కోట్లు కూడా చూస్తే మొత్తం రూ.10 వేల కోట్ల బకాయిలు అవుతాయి. ఈ పథకానికి రూ.10 వేల కోట్లు అవసరం ఉంటే బడ్జెట్‌లో రూ.2,600 కోట్లు పెట్టారు. అందులో ఎంత ఇస్తారో తెలియదు.
⇒ పిల్లలతో తల్లిదండ్రులు చదువులు మాన్పించి పనికి పంపిస్తున్న పరిస్థితి. స్కూల్స్‌లో నాడు–నేడు పూర్తిగా ఆగిపోయింది. పిల్లలకు బ్రహ్మాండమైన భోజనం పెట్టాలనే ఆరాటంతో మనం గోరు ముద్ద అనే కార్యక్రమం తీసుకొస్తే, ఈ రోజు కనుమరుగైన పరిస్థితి. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపించేవి. ప్రతి స్కూల్ ఇంగ్లిష్ మీడియం. ఆరో తరగతి నుంచి డిజిటలైజ్ క్లాస్ రూమ్‌లు. గవర్నమెంట్ స్కూళ్లు ప్రైవేటు స్కూల్స్‌తో పోటీ పడే పరిస్థితికి మన హయాంలో తీసుకొచ్చాం. ఈ రోజు ఆ స్కూల్స్ అన్నీ నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి మన కళ్లెదుటే కనిపిస్తోంది.
వైద్యంపై ఆలోచన చేసే నాథుడే లేడు
⇒ ఆరోగ్యశ్రీ పరిధి ప్రతి కుటుంబానికి ఏకంగా రూ.25 లక్షలకు పెంచాం. ప్రొసీజర్లను దాదాపు 3,300కు పెంచాం. ఆరోగ్యం బాగా లేకపోతే వైద్యం కోసం పేద, మధ్య తరగతి వాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని చేయి పట్టుకుని నడిపించాం. రెస్ట్ తీసుకునే సమయంలో కూడా ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు రూ.5 వేలు చేతిలో పెట్టి పంపించాం. ఈరోజు నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3,200 కోట్లు బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు వాటిని చెల్లించకపోతే చేతులు ఎత్తేస్తున్నాం.. మేం బోర్డు తిప్పేస్తాం.. అని ఆస్పత్రుల యాజమాన్యాలు ధర్నాలు చేస్తున్న పరిస్థితి. పేదవాడికి వైద్యం అందకపోయినా కనీసం ఆలోచన చేసే నాథుడే ఈ రోజు కనిపించడం లేదు.
⇒ ఉద్యోగుల బకాయిలు ఎప్పుడిస్తారో తెలియదు. మూడు డీఏలు పెండింగ్. ఐఆర్ ఇవ్వలేదు. ఉన్న పీఆర్‌సీ కమిషన్‌ను రద్దు చేశారు. కొత్త కమిషన్‌ను ఎప్పుడేస్తారో తెలియదు.
మిగిలినవి రెండే బడ్జెట్లు.. హామీల అమలు లేదు
⇒ ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పరిపాలన ఎలా ఉంది అన్నది మీలో ఎవరికి మైక్ ఇచ్చినా నాకన్నా చక్కగా చెబుతారు. ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? ఇటీవల మూడో సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. మిగిలి ఉన్నది కేవలం రెండే బడ్జెట్లు. ఈ మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన పరిస్థితుల మధ్య ఈరోజు మనకు కనిపించేవన్నీ మోసాలే.
⇒ సూపర్ సిక్సులు.. సూపర్ సెవెన్‌లు అన్నాడు. ఎన్నికల ముందు ప్రతి ఇంటికీ వెళ్లి బాండ్లు ఇచ్చాడు. ఆ బాండ్ల మీద ఈయన (చంద్రబాబు), పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారు. త్రికరణ శుద్ధితో మేం ఇద్దరం కలిసి ప్రమాణం చేస్తున్నాం.. జూన్ 2024 నుంచి ఇవన్నీ ప్రతి ఇంటికీ వస్తాయని చెప్పి బాండ్లు ఇచ్చి మోసం చేసిన పరిపాలన చూస్తున్నాం.
⇒ మేనిఫెస్టో అన్నది మన హయాంలో భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లుగా భావిస్తూ 99 శాతం హామీలను నెరవేర్చాం. ఈ మేరకు ప్రజల దగ్గరకు వెళ్లి గర్వంగా తలెత్తుకుని చెప్పేలా మన పార్టీ హయాంలో జరిగింది. ఈ రోజు మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు మళ్లీ చూస్తున్నాం. జగన్ ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి.. జగన్ లేకపోతే పరిస్థితి ఏమిటి అన్నది స్పష్టంగా కనిపిస్తోంది.
అంతా దోచుకో పంచుకో తినుకో.. డీపీటీ
⇒ జగన్ చేయగలిగింది చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారనే దానిపై కూడా ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. కారణం ఒక్కటే. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు జగన్ హయాంలో పుష్కలంగా వచ్చేవి. ఈ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడ చూసినా దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ). రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ వీళ్లు దోచుకోవడానికి, వీళ్లు పంచుకోవడానికి, వీళ్లు తినుకోవడానికే సరిపోతున్నాయి.
⇒ ఈ రోజు ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. ఏ గ్రామంలో చూసినా వీధి వీధినా బెల్ట్ షాపులు. పోలీసులే దగ్గరుండి ఆ బెల్టు షాపుల్లో అమ్మించే కార్యక్రమం. ఎమ్మార్పీ కంటే రూ.10, రూ.20 ఎక్కువకు అమ్ముతున్నారు. అందుకే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అంతా వీళ్ల జేబుల్లోకి పోతోంది. లిక్కర్ మొదలు ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్‌జ్, ల్యాటరైట్, గ్రానైట్, చివరికి చికెన్ అమ్మాలన్నా కూడా వీళ్లకు రావాల్సింది వీళ్లకు ఇస్తేనే సరి. లేదంటే చికెన్ కూడా అమ్మనివ్వడం లేదు చాలా నియోజకవర్గాల్లో. ఆ స్థాయిలో దోచుకుంటున్నారు.
⇒ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. పీపీఏలు. మన హయాంలో మనం రూ.2.49కి యూనిట్ ఇచ్చేలా పీపీఏ చేసుకున్నాం. రైతులకు మరో 25–30 ఏళ్లపాటు ఉచిత కరెంటు అన్నది ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా అందించాలన్న ఆరాటంతో ఆ మేరకు పీపీఏలు చేస్తే ఆరోజు నానా యాగీ చేసిన వీళ్లు ఈ రోజు రూ.4.60తో పీపీఏ చేస్తున్నారు. ఎంత తేడా! కళ్ల ముందే కనిపిస్తున్నాయి వీరి అక్రమాలన్నీ.
⇒ ప్రభుత్వ భూములు పప్పులూ, బెల్లాలకు అమ్మేస్తున్నారు. రూపాయికి చాక్లెట్ వస్తుందో రాదో నాకైతే తెలియదు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో రూపాయికి కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తున్నాయి. కళ్ల ఎదుటే రుషికొండకు ఎదురుగా రూ.5 వేల కోట్ల విలువ చేసే 50 ఎకరాల ప్రభుత్వ భూమిని చంద్రబాబు తన సమీప బంధువు అయిన విశాఖపట్నం ఎంపీకి ఉచితంగా ఇచ్చాడు. ఊరికే రెగ్యులరైజేషన్ చేశారు.
అమరావతిలో కళ్ల ఎదుటే యథేచ్ఛగా దోపిడీ
⇒ అమరావతి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంత దారుణమైన స్కాములు జరుగుతున్నాయన్నది మనందరికీ ఇప్పటికే అర్థమైంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ లెవెల్‌లో.. ఇటాలియన్ మార్బుల్ వంటి సదుపాయాలతో కట్టినా చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.4,500కు మించదు. కానీ అమరావతిలో మాత్రం అడుగుకు రూ.12 వేల నుంచి రూ.14 వేలు ఖర్చవుతోంది. ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కిలోమీటరు రోడ్డు రూ.20 కోట్లకు పూర్తవుతోంది. ఇక్కడ మాత్రం రూ.53 కోట్లవుతోంది. ఎక్కడా లేని స్కాములు.
⇒ ఈ స్కాముల్లో భాగస్వాములు ఎవరంటే ఈనాడు కిరణ్ వియ్యంకుడు ఒకరు. ఇంకొకరు చంద్రబాబు బినామీ బలుసు శ్రీనివాసరావు (బీఎస్సార్). అంతా వీళ్లే. వీళ్లకు కొత్తగా మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్సులు. ఇంతకు ముందు వర్కులు చేస్తే బిల్లులు చెల్లించే వాళ్లం. చంద్రబాబు పాలనలో వర్కులు చేయాల్సిన పని లేదు. చంద్రబాబు మనుషులే కాబట్టి ముందుగానే 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సు. ఒక్కొక్కరికీ రూ.6 వేల కోట్ల పనులు.. దానికి రూ.600 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు. పనులు చేయడం కథ దేవుడెరుగు.. మొదట మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తూ ఆ స్థాయిలో దోచేస్తున్నారు. ఇలా కొల్లగొడుతూ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది? రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వర్గాల పరిస్థితి ఏంటి?
రాక్షస పాలనలో ఇదీ యుద్ధం
⇒ ఏ వ్యవస్థ చూసినా ఎక్కడా మంచి కనిపించడం లేదు. అంతా తిరోగమనమే. మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు. ముఖ్యమైన రాయలసీమ లిఫ్టు వంటి ప్రాజెక్టులు ఆపేయడం కనిపిస్తోంది. రైతులు, పిల్లలు, అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడే లేడు. స్కీముల కథ దేవుడెరుగు.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కనీసం సున్నా వడ్డీ రుణాలు కూడా ఇవ్వని దుస్థితి. డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి.
⇒ రాష్ట్రంలో ఏ మాదిరిగా పరిపాలన సాగుతుందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రంలో యుద్ధం జరుగుతోంది. ప్రజల తరుఫున, మంచి తరఫున, ప్రజలకు మంచి చేయాలన్న ఆరాటంతో వైఎస్సార్‌సీపీ ఒకవైపున నిలుచుంటే.. మరోవైపు రాష్ట్రానికి అన్ని రకాలుగా చెడు చేస్తూ.. రాష్ట్రాన్ని దోచుకుని తింటున్న తెలుగుదేశం పార్టీ. ఈ యుద్ధంలో దేవుడు కచ్చితంగా మనపక్షానే నిలుస్తాడు. రేప్పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు తెలుగుదేశం పార్టీని ఫుట్ బాల్‌ను తన్నినట్టు తంతారు. సింగిల్ డిజిట్ కూడా చంద్రబాబుకు రాకుండా ఉండే పరిస్థితి అతి త్వరలోనే వస్తుంది.
⇒ వైఎస్సార్‌సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా, తోడుగా మేం ఉన్నామని గర్వంగా చెబుతున్నాను. కళ్లు మూసుకుని తెరిచేలోపు ఐదేళ్లలో సగం కాలం అయిపోయింది. ఇక మిగిలింది సగం కాలమే. కూటమి పాలనకు సగం టర్మ్ అయిపోయింది. మిగిలింది ఇంకో సగం టర్మ్ మాత్రమే. ఇంకో సంవత్సరం దాటితే, రేపటి సంవత్సరం వచ్చేసరికి నా పాదయాత్ర కూడా ప్రారంభం అవుతుంది. నేను రోడ్డు మీదకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాను. పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తాం’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
⇒ ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జ్ వడ్డి రఘురాం, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పార్టీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు,
కార్యకర్తలు పాల్గొన్నారు.
వీళ్లపై యాక్షన్ ఏదీ?
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేసి, మోసం చేశాడని బాధితురాలు ఆందోళన చేస్తుంటే.. న్యాయం చేయమని కంప్లైంట్ ఇస్తే.. ఆమెనే కొడుతున్నారు. ఆ పాప రోడ్డెక్కి తనకు అన్యాయం జరిగిందని చెబుతుంటే పోలీసుల సమక్షంలోనే కొడుతున్నారు.
నరసరావుపేట ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ ఆఫీసుకు వెళ్లి బాత్రూంలోకి పోయి డోర్ గడియ పెట్టుకున్నాడు. ఎస్పీ ఆఫీసులోకి పోవడమేంటి? బాత్రూంలోకి వెళ్లి డోర్ గడేసుకోవడమేంటి? గడేసుకుని స్ట్రైక్ చేయడమేంటి? తీసుకెళ్లి బొక్కలో వేయకుండా చంద్రబాబునాయుడు పంచాయితీ చేస్తున్నాడు.
బీఆర్ నాయుడు ఏం చేస్తున్నాడో మనందరం చూసూ్తనే ఉన్నాం. టీటీడీ చైర్మన్‌గా ఉండి చేయకూడని తప్పులు చేస్తుంటే ఏం చేయాలి? ఆ మనిషిని టీటీడీ పదవిలో నుంచి ఊడబెరకాలా? వద్దా? చంద్రబాబు పక్కన పెట్టుకుని తిప్పుతున్నాడు. ఇంత దారుణంగా తయారయ్యారు.
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధించాడని కేజీబీవీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేస్తే నో యాక్షన్. పట్టించుకునేవాడు లేడు.
గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మహిళలకు వీడియో కాల్స్ చేసి అశ్లీలంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆడవాళ్లకు ఫోన్ చేసి అశ్లీలంగా వ్యవహరించాడు. అది బహిరంగంగా కనపడుతూనే ఉంది. ఎలాంటి యాక్షన్ లేదు.
టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళలపై దారుణంగా లైంగిక దాడులు చేసినా పట్టింపులేదు. మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన వీడియోలు బయటికి వచ్చినా ఆ ఆదిమూలంపై నో యాక్షన్. వీరంతా ఎమ్మెల్యేలు.. ఒకరు తప్పు చేస్తే ఏం యాక్షన్ లేదు.. ఆడి మీద యాక్షన్ లేదు కాబట్టి.. నా మీద ఏం యాక్షన్ తీసుకుంటారులే అని ఇంకొకడు. ఇలా ఒకడిని చూసి ఇంకొకడు రాక్షసులవుతున్న పరిస్థితి.
మహిళను లైంగికంగా వేధించిన మంత్రి సంధ్యారాణి పీఏ.. ఆ పీఏ మీద కూడా నో యాక్షన్. పైగా ఆ మహిళ మీదే ఎదురు కేసు. ఈ స్థాయిలో రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఉంటే.. చివరికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడే మాటలు. ఒకరిని చూసి ఇంకొకరు.


