ప్రధాని మోదీకి కొందరు ఎంపీలు, పలువురు నేతల లేఖ
గ్రూపులు, ఇబ్బందులు, తదితర అంశాల ప్రస్తావన
సీఎస్‌ఆర్ నిధుల కోసం రిప్రజంటేషన్లు పంపామంటున్న ఒకరిద్దరు ఎంపీలు
లేఖలు, ఫిర్యాదులపై లక్ష్మణ్ వర్సెస్ అర్వింద్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ బలోపేతానికి సూచనల పేరిట ప్రధాని మోదీకి కొందరు ఎంపీలు, నేతలు లేఖ రాయడం రాష్ట్ర బీజేపీలో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఎంపీలుగా గెలిచాక సంస్థాగతంగా పార్టీలో ఎదుర్కొంటున్న సమస్యలు, నియోజకవర్గ స్థాయిల్లో కొందరు నాయకులు, ప్రత్యర్థి, వైరివర్గాలుగా వ్యవహ రించడం, రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు కొందరు జిల్లాల్లో తమ గ్రూపులకు ప్రాధాన్యతమివ్వడం వంటి అంశాలను ఇందులో ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది.
స్థానికంగా జిల్లాలు, ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల పరిధిలో తమకు ఎదు రవుతున్న ఇబ్బందులు, తాము స్వేచ్ఛగా వ్యవ హరించకుండా రాజకీయంగా అడ్డుపడుతున్న నేతలు లేదా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో అడ్డంకులు సృష్టించడం, గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో పర్యటించకుండా, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకోవడం వంటి అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
ప్రధానంగా తమ తమ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఖర్చు చేసేందుకు వీలుగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్) నిధులను విరివిగా కేటాయించాలని ఎంపీలు ఈ లేఖలో కోరినట్లు తెలుస్తోంది. అయితే పనిలో పనిగా రాష్ట్రంలో పార్టీపరిస్థితి, పుంజుకోకపోవడానికి కారణాలు, కొందరు నేతల వ్యవహారశైలి, ఆధిపత్యధోరణి, సర్వం తామే అన్నట్లుగా అన్ని విషయాల్లో కలగజేసుకోవడం తదితర అంశాల గురించి ఇందులో ప్రముఖంగా వివరించినట్లు పార్టీనేతలు చెబుతున్నారు.
రాష్ట్రానికి చెందిన కొందరు బీజేపీ ఎంపీలు (ఇద్దరు కేంద్రమంత్రులు మినహా) ఈ లేఖ రాయడం రాజకీయంగా ప్రాధా న్యత సంతరించుకుంది. వీరిలో కొందరు ఎంపీలు మాత్రం తమ నియోజకవర్గాలకు సీఎస్‌ఆర్ ఫండ్స్ కేటాయింపునకు సంబంధించి ‘రిప్రంజేటేషన్స్’ఇచ్చామని మాత్రం అంగీకరిస్తున్నారు. ఓ ఎంపీ మాత్రం ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ‘లేఖరాశాం.. అందులో తప్పేముంది?’అంటూ నేరుగానే సమాధానం ఇచ్చారు.
లేఖల కల్చర్ లేదు.. కాదు ఉంది..
ఇదిలాఉంటే...బుధవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డుసభ్యుడు డా.కె.లక్ష్మణ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడినపుడు ఈ లేఖ విషయం ప్రస్తావనకు వచ్చింది. బీజేపీలో లేఖలు రాసే సంస్కృతి లేదని, ఒక వ్యక్తి మీద ఎప్పుడు పార్టీ నడవదని టీమ్ గా బీజేపీ పని చేస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యలు హేట్ స్పీచ్ కిందకే వస్తాయా? రావా? అన్నది సీఎం రేవంత్ చెప్పాలన్నారు.
లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి స్పందిస్తూ లేఖలు రాసే సంస్కృతి లేదన్న లక్ష్మణ్ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీలో లేఖలు రాసే సంస్కృతి లేదని డా.లక్ష్మణ్ అంటున్నారని, ఆయన బీజేపీ సీనియర్ నేతగా స్వయంగా తన మీదనే లేఖ రాశారన్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు, బూతులు తిడుతున్నట్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని అర్వింద్ పేర్కొన్నారు.


