సాక్షి, తాడేపల్లి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్.. మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ ప్రజా ప్రతినిధుల్ని అగౌరవ పరిచే విధంగా కథనాలు ప్రసారం చేస్తోందని జాతీయ మహిళా కమిషన్‌కు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పూర్తి ఆధారాలతో జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు ఆమె ఓ లేఖ రాశారు.
తమ పార్టీ నేతలతో పాటు మహిళల్ని కించ పరిచే విధంగా కథనాలు ప్రసారం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కోరారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు రాసిన లేఖలో వరుదు కళ్యాణి ఇంకా ఏం పేర్కొన్నారంటే..
మీడియా స్వేచ్ఛ పేరుతో ఏబీఎన్ వ్యక్తిత్వ హననం
ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి న్యూస్ ఛానల్, దాని యాంకర్, ఎడిటర్, యాజమాన్యం తమ ఎలక్ట్రానిక్, డిజిటల్ వేదికల ద్వారా, యూట్యూబ్ వీడియో లింక్ : https://youtu.be/nF_9828F18c సహా, అత్యంత అపకీర్తికరమైన, అవమానకరమైన, తప్పుదారి పట్టించే, అనైతిక విషయాలను ప్రసారం చేసినందుకు సంబంధించి తక్షణ జోక్యం, తగిన చర్యలు తీసుకోవాలి. ఈ కథనం ప్రసారం మీడియా స్వేచ్ఛ దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణ. ఇందులో అన్నీ అవాస్తవాలతో పాటు దురుద్దేశపూర్వక, హానికరమైన విషయాలను ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేసింది. ఇది నిష్పక్షపాత పాత్రికేయ కథనం కాదు. ద్వేషం, హేళన, పక్షపాతాన్ని ప్రేక్షకుల మనసుల్లో నింపేందుకు ఉద్దేశించిన పక్షపాతపూరిత, ఏకపక్ష కథనమే.
వైఎస్సార్సీపీ నేతలపై దారుణ వ్యాఖ్యలు
ఏబీఎన్‌లో ప్రసారమైన ఈ కథనంలో 7వ నిమిషం నుండి 8వ నిమిషం మధ్య ముఖ్యంగా,యాంకర్ అత్యంత అభ్యంతరకరమైన, పరువుకు భంగం కలిగించే భాషను వాడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను, మద్దతుదారులను వెన్నెముక లేని వారిగా అభివర్ణించింది. అంతేకాక వారు తమ నాయకుడికి ఆపాదించిన అసంబద్ధమైన, హాస్యాస్పదమైన వ్యాఖ్యలను కూడా గుడ్డిగా నమ్ముతారని అనుకునే విధంగా పలు అసంబద్ధమైన వ్యాఖ్యలు కూడా చేసింది.
రేపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీ భార్యలు మీ భార్యలు కాదని చెప్పితే, మీరు గుడ్డిగా విశ్వసిస్తారు, అంతేకాదు మీ సొంత భార్యలను కూడా అక్కాచెల్లెళ్లుగా భావించి, పెళ్లి సంబంధాలకు కూడా చూసుకుంటారు, ఇలాంటి నాయకులే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు!” అంటూ సిగ్గులేని వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారహితం, తీవ్ర అభ్యంతరకరం. ప్రజల దృష్టిలో వైఎస్సార్సీపీ నేతల ప్రతిష్టను పలుచన చేసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.
కనీస బాధ్యత లేని పాత్రికేయం
ఈ వివాదాస్పద కథనంలో ఏబీఎన్.. వైఎస్సార్సీపీ నేతల్ని తెలివి, హేతుబద్దత, బుద్దీ జ్ఞానం లేని వారిగా చిత్రీకరించింది. అలాగే మా పార్టీ విధానాల్ని పిచ్చి ప్రతిపాదనలు అంటూ ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసింది. ఈ కథనంలో యాంకర్ మరింత ముందుకు వెళ్లి తమ పార్టీ నేతల్ని పిచ్చి వాళ్ల సమూహంగా కూడా అభివర్ణించడం దారుణం. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమైన, పరువు నష్టం కలిగించే కథనమే అవుతుంది. ఈ వ్యాఖ్యలకు ఏ విధమైన వాస్తవ ఆధారాలు లేవు. లేదా ధృవీకరించబడిన మూలాలు కూడా లేవు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఏకపక్షంగా సాధారణీకరించి, కేవలం ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా, ప్రజలను తప్పుదారి పట్టించేలా వండి వార్చినట్లు స్పష్టమవుతోంది. ఇందులో వాడిన భాష కూడా అత్యంత అసభ్యంగా ఉంది. పార్లమెంటరీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉంది. బాధ్యతాయుత మీడియా సంస్థ నుంచి ఆశించే ప్రాథమిక మర్యాదా ప్రమాణాలను కూడా ఉల్లంఘించింది.
ఏబీఎన్ కథనం కేబుల్, టెలివిజన్ చట్టం ఉల్లంఘనే
ఏబీఎన్ ప్రసారం చేసిన ఈ కథనం కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ (నియంత్రణ) చట్టం, 1995 కింద నిర్దేశించిన ప్రోగ్రామ్ కోడ్ ను పూర్తిగా ఉల్లంఘించింది. ఆ కోడ్ ప్రకారం అగౌరవ, తప్పుడు, అర్థసత్యాలైన విషయాలను ప్రసారం చేయకూడదు. ఇది పూర్తిగా నిషిద్దం. ఎందుకంటే ఇది ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించేది, తప్పుదారి పట్టించేదిగా ఉంది. అలాగే నిర్లక్ష్యంగా వండి వార్చడంతో పాటు ద్వేషం కలిగించేలా దీన్ని రూపొందించారు. వాస్తవాలను ధృవీకరించకపోవడం, సమతుల్య అభిప్రాయాలు ఇవ్వకపోవడం, లేదా ప్రతిస్పందనకు అవకాశం కల్పించకపోవడం మీడియా బాధ్యత, నైతిక ప్రమాణాల తీవ్ర ఉల్లంఘనే అవుతుంది. అలాగే ఏబీఎన్ సంస్థ సంపాదకీయ నియంత్రణ పూర్తిగా లోపించిందని అనిపిస్తోంది. కాబట్టి ఇలాంటి బాధ్యతారహిత, హానికరమైన కంటెంట్ ప్రసారం అయ్యేందుకు అవకాశం లభించింది.
తక్షణం ఏబీఎన్ పై కఠిన చర్యలు తీసుకోండి
ఈ కంటెంట్ డిజిటల్ వేదికలపై కొనసాగుతూ అందుబాటులో ఉండటం వల్ల తమ పార్టీకీ, అధినేత జగన్‌కు జరిగిన నష్టం మరింత పెరుగుతోంది. ఎందుకంటే ఇది విస్తృతంగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండి వారికి పరువుకు భంగం కలిగించేలా ఉంది. దీన్ని ఇలాగే వదిలేస్తే.. ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుంది. అలాగే మీడియా సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి గౌరవ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు ఈ విషయాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకుని, ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి, దాని యాంకర్, ఎడిటర్, యాజమాన్యంపై చట్టప్రకారం తగిన చర్యలు ప్రారంభించాలి.
అందులో అభ్యంతరకర కంటెంట్ తొలగింపుతో పాటు ప్రజలకు క్షమాపణ చెప్పడం, భవిష్యత్తులో ప్రోగ్రామ్ కోడ, పాత్రికేయ ప్రమాణాలకు పూర్తిగా కట్టుబడి ఉండేలా చూడాల్సిన అసరం ఉంది. ఈ మేరకు తగు ఆదేశాలు జారీ చేయాలని ఛైర్ పర్సన్ ను కోరుతున్నాం. న్యాయం, నిష్పాక్షికత, వ్యక్తులు, సంస్థల గౌరవ పరిరక్షణ కోసం తగిన ఇతర ఆదేశాలను కూడా జారీ చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విజ్ఞప్తి చేశారు.


