సాక్షి, తాడేపల్లి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైఎస్సార్‌సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుపుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ప్రజల నిరసన సెగలు తగలాలి అని అన్నారు.
నిరసనలు ఇలా..
జూన్ 4న మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నిరసనలు.
జూన్ 8 లేదా 9న నియోజకవర్గ హెడ్‌క్వార్టర్స్‌లో టౌన్‌హాల్ సదస్సులు నిర్వహించాలి.
జూన్ 12న ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు. బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైంది. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైంది. మూడోసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. సూపర్-6, సూపర్-7 లేదు. ఆడబిడ్డ నిధికి నిధుల్లేవు.
18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలే. నిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. మావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారు. వ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదు. రాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ!. తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోంది. ఇప్పటికీ హామీల అమలు లేదు. మేనిఫెస్టో అడ్రస్ కనిపించదు. ఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగారు. గొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారు. ప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ, తెలివైన వాళ్లని గుర్తించాలి’ అని చెప్పుకొచ్చారు.


