బీటెక్‌ రవి.. నువ్వెంత.. నీ బతుకెంత?: అవినాష్‌ రెడ్డి హెచ్చరిక | YS Avinash Reddy Serious Comments On TDP Btech Ravi | Sakshi
Sakshi News home page

బీటెక్‌ రవి.. నువ్వెంత.. నీ బతుకెంత?: అవినాష్‌ రెడ్డి హెచ్చరిక

May 25 2026 1:47 PM | Updated on May 25 2026 2:24 PM

YS Avinash Reddy Serious Comments On TDP Btech Ravi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు బుద్దుందా?.. ఎవరిది గొడ్డలి పార్టీ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా?. దస్తగిరిని నెత్తిన పెట్టుకుంది టీడీపీ కాదా?. బీటెక్‌ రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వెంత.. నీ బతుకెంత.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

పులివెందులలో వైఎస్సార్‌సీపీ బూత్‌ లెవల్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఇతర కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘అమరావతిలో చంద్రబాబు కట్టే బిల్డింగుల అద్దాలకు అయ్యే ఖర్చుతో రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీలన్నిటినీ పూర్తి చేయవచ్చు. ఇలాంటి దోపిడీని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.. ఎదురుదాడికి దిగుతారు. గతంలో పన్నులు తగ్గిస్తే.. పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గుతాయన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ పని మాత్రం చేయడం లేదు. వీటన్నిటిపై వైఎస్‌ జగన్‌ ప్రశ్నిస్తే జవాబు లేదు.

మీరు చేస్తున్న తప్పులను సరిచేసుకోండి అంటే వాళ్లు.. స్వర్గీయ రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. లేదంటే వైఎస్సార్‌ గురించి మాట్లాడతారు. గొడ్డలి పార్టీ అంటారు. అసలు చంద్రబాబుకు బుద్ధుందా?. తానే గొడ్డలితో కిరాతకంగా చంపానని దస్తగిరి చెప్తే.. అతన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నది మీ పార్టీ కాదా?. ఏరకంగా మాది గొడ్డలి పార్టీ అవుతుంది.. గొడ్డలి పార్టీ మీది. గొడ్డలితో నరికి చంపిన వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నది మీరు. మా ప్రశ్నలకి సమాధానం లేక.. చేతిలో అధికారం ఉందని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇక్కడ పులివెందులలో ఉన్న టీడీపీ నాయకులు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్లు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పులివెందులకు కన్నం వేసి దోచేసుకుంటున్నారు.

నోరు జాగ్రత్తగా పెట్టుకో..
ఇక్కడి బైరెటిస్, ఇసుక మొత్తాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారు. పులివెందులలో వీళ్లు ఏ ఒక్క సమస్యనైనా పట్టించుకుంటున్నారా?. పులివెందుల ప్రజలు పట్టరు కానీ.. కేవలం జగన్నను తిడితే మీకు రాజకీయంగా మనుగడ అని భ్రమల్లో బతుకుతున్నారు. మీ ప్రతి ఒక్క మాటకూ జవాబు తప్పకుండా చెప్తాం. నిన్న బీటెక్‌ రవి.. వాడు వీడు అనే లెవల్‌లో మాట్లాడాడు. నీ గురించి అలా మాట్లాడాలంటే మాకు ఎంత సేపు?. నువ్వెంత.. నీ బతుకెంత? ఇసుక, ముగ్గురాయికి కన్నం వేసి బతికేవాడివి నువ్వు. అలాంటి నువ్వు వైఎస్‌ జగన్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడేవాడివా? నోరు జాగ్రత్తగా పెట్టుకో.

బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?
మేం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చావ్‌.. ఎందుకొచ్చావో ప్రజలకు చెప్పు. ఆయన ఎమ్మెల్సీ పదవి అమ్ముకోడానికి 12 కోట్లు ఇప్పించండని విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చాడు. ఆనాడు జగన్‌ అలాంటి పనులు చేయన‌ని తిరస్కరించారు. తన ఎమ్మెల్సీ పదవి అమ్మేస్తా.. మీరు ఒప్పుకుంటే వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకుంటా అన్నది నువ్వు కాదా?. మా పార్టీలో చేర్చుకోకపోతే సీఎం రమేష్‌ను పట్టుకుని బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?. ఇదీ బీటెక్‌ రవి బతుకు. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకు అతనిది. అలాంటి వ్యక్తి ఈరోజు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారందరికీ మనం అధికారంలోకి రాగానే మంచి సమాధానం చెబుదాం. కక్షలు, కార్పణ్యాలు కాకుండా.. మనం ప్రజలకు మంచి చేసి ఇలాంటి వారికి బుద్ధి చెబుదాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement