విశాఖ ప్రమాదం: పైడిరాజు కన్నుమూత | Vizag Steel Plant Disaster: Paidiraju Dies Deathtoll Reach 9 News | Sakshi
Sakshi News home page

విశాఖ ప్రమాదం: పైడిరాజు కన్నుమూత

Jun 10 2026 11:35 AM | Updated on Jun 10 2026 11:48 AM

Vizag Steel Plant Disaster: Paidiraju Dies Deathtoll Reach 9 News

కంటతడి పెట్టిస్తున్న ఆ వీడియో ఇప్పుడు ఒక కుటుంబానికి మాత్రమే కాదు.. మొత్తం సమాజానికి గుండె బరువెక్కే జ్ఞాపకంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు పైడిరాజు, ప్రాణాల కోసం పోరాడుతూ తన కుటుంబానికి చివరిసారిగా చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. అయితే మృత్యువుతో జరిగిన పోరాటంలో చివరకు ఆయన ఓడారు.

సాక్షి, విశాఖపట్నం: “వర్మా… తమ్ముడి మీద ఎప్పుడూ చిరాకు పడకే. తమ్ముడిని బాగా చదివించురా… నువ్వు కూడా బాగా చదువుకోమ్మా… అమ్మని బాగా చూసుకోండి… ఉంటాను డాడీ” అంటూ ఆయన చెప్పిన మాటలు వీడియో రూపంలో వైరల్‌ అయ్యాయి. ఆ మాటలతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒంటినిండా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ క్షణాల్లోనే, భవిష్యత్తుపై భయంతో ఆయన తన పిల్లలకు జాగ్రత్తలు చెప్పిన తీరు ఇటు మీడియాలో, అటు నెట్టింట వైరల్‌ అయ్యింది.

అయితే బతుకుతారేమోనన్న ఆశలు ఎక్కువసేపు నిలవలేదు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పైడిరాజు మృతి చెందారు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రాణాలతో పోరాడుతూనే, తన కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించిన ఆ తండ్రి మాటలు ఇప్పుడు అందరి గుండెల్లో నిలిచిపోయాయి.

కూటమి రాజకీయం!
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనలో కూటమి సర్కార్‌ కుట్ర రాజకీయాలకు తెర తీసింది. కేజీహెచ్‌ నుంచి పైడి రాజు మృతదేహాన్ని ఆగమేఘాల మీద తరలించింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పరామర్శకు వస్తున్నారని తెలిసి.. హడావిడిగా బంధవులకు అప్పగించారు అధికారులు.  మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లాలని.. త్వరగా అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు ఒత్తిళ్లు చేసినట్లు సమాచారం. నిన్న మృతదేహాలకు 12గంటలకు పైగా సమయం తీసుకున్న పోలీసులు ఇవాళ గంటలోనే పైడి రాజు మృతదేహాన్ని తరలించడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement