Vizag Airport: రెక్కలు విచ్చుకున్న విశాఖ విహంగం | Sakshi
Sakshi News home page

Vizag Airport: రెక్కలు విచ్చుకున్న విశాఖ విహంగం

Published Wed, May 26 2021 7:33 PM

Vizag Airport Expansion Work: Six Parking Bays, Taxi Track Ready - Sakshi

ఏపీలో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన విశాఖ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు అంతర్జాతీయ విమానాశ్రయంగా పౌర విమానాలు రాకపోకలు సాగిస్తుండగా.. మరోవైపు నేవల్‌ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగానూ ఎయిర్‌పోర్టు సేవలందిస్తోంది. సేవలు విస్తరించేందుకు సరికొత్త ఆలోచనలు అమలు చేస్తున్న ఎయిర్‌పోర్టు.. మరో ఆరు పార్కింగ్‌ బేస్‌ల నిర్మాణం పూర్తి చేసింది. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇండియన్‌ నేవీ విమానాశ్రయం ఐఎన్‌ఎస్‌ డేగాలో పౌర విమానయాన సేవలందిస్తోంది. మొత్తం 349.39 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం విస్తరించి ఉంది. దేశంలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైన గుర్తింపు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉంది.

సాధారణంగా దాదాపు ప్రతి విమానాశ్రయంలోనూ రన్‌వేకు రెండు వైపుల నుంచి టేకాఫ్, ల్యాండింగ్స్‌ జరుగుతుంటాయి. కానీ విశాఖలో మాత్రం విమానాశ్రయానికి ఓవైపు పెద్ద కొండ ఉండటం వల్ల ఒకవైపు నుంచి మాత్రమే రాకపోకలు సాగుతున్నాయి. 1981లో రోజుకు ఒక విమానం ద్వారా ప్రారంభమైన పౌర సేవలు ప్రస్తుతం సుమారు 70 వరకు చేరుకున్నాయి. అయితే కోవిడ్‌ కారణంగా కేవలం 14 సర్వీసులు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. భవిష్యత్తులో రాకపోకలు పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టారు. 


ఏక కాలంలో 16 విమానాల రాకపోకలు
బ్రిటిష్‌ కాలంలో 4 పార్కింగ్‌ బేస్‌ ఉండేవి. తరువాత మరో 6 పార్కింగ్‌ బేస్‌లు నిర్మించారు. గతంలో ఉండే రన్‌వే వినియోగించే అవకాశం లేదు. ఇప్పుడు ఒకే రన్‌వే ఉంది. దాన్ని నేవీతో సంయుక్తంగా వినియోగిస్తున్నారు. రన్‌వేపై వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. నేవీ టవర్‌ కంట్రోల్‌ రూమ్‌తో రన్‌వేను అనుసంధానం చేశారు. ఎవరైనా రన్‌వే పైకి వెళ్లాలంటే రక్షణ దళ అనుమతి తప్పనిసరి. యాప్రాన్, హ్యాంగర్స్, టెర్మినల్‌కు రన్‌వేలో ఉన్న విమానంతో అనుసంధానమయ్యేలా ఉండే ట్యాక్సీ వేలు కూడా నేవీ భాగంలోనే ఉన్నాయి. అందుకే ప్రత్యేకంగా మరో కొత్త ట్యాక్సీ ట్రాక్‌ నిర్మించారు. దీనికితోడు తాజాగా మరో ఆరు పార్కింగ్‌ బేస్‌ల నిర్మాణం కూడా పూర్తయింది. ఇవి త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇవి కూడా అందుబాటులోకి వస్తే మొత్తం 16 విమానాలు ఏక కాలంలో రాకపోకలు సాగించే అవకాశాలున్నాయి. 

పరిమితి పెంచేందుకు ప్రయత్నాలు
అంతర్జాతీయ స్థాయి సదస్సులకు వేదికగా విశాఖ నిలుస్తోంది. దీనికితోడు రాష్ట్ర కార్యనిర్వాహక రాజ«ధానిగా కొత్త రూపుదాల్చనుంది. దీనికితోడు కొత్త రైల్వే జోన్, పోర్టులు, జలరవాణా, జాతీయ రహదారులు ఇలా విశిష్ట సామర్థ్యమున్న విశాఖకు కాలానుగుణంగా కనెక్టివిటీ పెరగాల్సి ఉంది. అయితే నేవీ ఇచ్చిన స్లాట్స్‌ ప్రకారం 85 విమానాల కంటే ఎక్కువ నడపలేని పరిస్థితి ఉంది. ఈ స్లాట్‌ పెరగాలంటే.. లిమిటేషన్‌ పెంచాలి. అది పెరగాలంటే రన్‌వే హ్యాండ్లింగ్‌ కెపాసిటీ పెంచాలి, ఆక్యుపేషన్‌ టైమ్‌ తగ్గించాలి. రన్‌వే ఎఫిషియన్సీ పెంచాలి. ఇది పెరిగితే ప్రస్తుతం ఉన్న గంటకు 10 రాకపోకల స్లాట్‌లో పాసింజర్‌ విమానాల సామర్థ్యం 16కి పెరుగుతుంది.

రన్‌వే హ్యాండ్లింగ్‌ పెరిగి, ఆక్యుపేషన్సీ తగ్గి 50 శాతం పెరిగితే ప్రస్తుతం ఉన్న 85 విమానాల రాకపోకల కెపాసిటీ 123కు చేరుకుంటుంది. దీనివల్ల ఇతర ప్రాంతాలకూ కనెక్టివిటీ ఫ్లైట్స్‌ పెరుగుతుంది. అప్పుడు ఇతర నగరాలకు రాకపోకలు విస్తరించవచ్చు. డిమాండ్‌ ఉన్న సమయాల్లో మరిన్ని ఫ్లైట్స్‌కు స్లాట్స్‌ కేటాయించవచ్చు. ట్యాక్సీ ట్రాక్‌ల పెంచినప్పుడు ల్యాండింగ్‌ అయ్యే విమానాలు.. వెంట వెంటనే వచ్చి వెళ్లిపోయే అవకాశముంది. దీని వల్ల రన్‌వేపై ఆక్యుపెన్సీ టైమ్‌ తగ్గుతుంది. దీనివల్ల స్లాట్‌ సామర్థ్యం మరింత పెరిగి పాసింజర్‌ ఫ్లైట్స్‌ పెరగవచ్చు. కొత్త ట్యాక్సీట్రాక్‌ నిర్మాణం పూర్తి కావడంతో దీనికి మార్గం సుగమమైంది.

సమగ్రాభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం..
విశాఖ విమానాశ్రయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. దీనికి సంబంధించిన ప్లాన్స్‌ సిద్ధమయ్యాయి. కీలక అడుగులకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. వాణిజ్య కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో టైర్‌–2, టైర్‌–3 టైర్‌–4 దేశీయ ఎయిర్‌పోర్టులకు కనెక్టివిటీ కోసం ఫ్లైట్స్‌ నడిపేలా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కోవిడ్‌ భయం పూర్తిగా తొలగిపోయాక.. అత్యధిక ఫ్లైట్స్‌ నడిపేందుకు సన్నద్ధమవుతాం. దీనికి తోడు ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌తో పాటు కార్గో సేవలు విస్తరించేందుకు చెయ్యాల్సిన అభివృద్ధిపై ప్రస్తుతం దృష్టి సారించాం. కొత్తగా నిర్మించిన పార్కింగ్‌ బేస్‌లు, ట్యాక్సీ ట్రాక్‌లని త్వరలోనే ప్రారంభిస్తాం. ఎయిర్‌లెన్స్‌తో పాటు నేవీ నుంచ తేదీ ఖరారు చేసిన తర్వాత వీటిని అందుబాటులోకి తీసుకొస్తాం.
– రాజాకిశోర్, విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ 

Advertisement
Advertisement