విశాఖలో వాన బీభత్సం.. | Visakhapatnam battered by rains city on sea storm alert | Sakshi
Sakshi News home page

విశాఖలో వాన బీభత్సం..

May 28 2026 7:30 AM | Updated on May 28 2026 7:37 AM

Visakhapatnam battered by rains city on sea storm alert

సాక్షి, విశాఖపట్నం: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన విశాఖవాసులకు గురువారం ఉదయం వర్షం ఊరటనిచ్చింది. అయితే కాసేపటికే వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభించిపోగా.. ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా విశాఖ నగరానికి సమీపంలో సముద్రం వైపు అకస్మాత్తుగా సీ స్టార్మ్‌ ఏర్పడినట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ద్వారకానగర్‌, మధురవాడ, సీతమ్మధార, జగదాంబ జంక్షన్‌తో పాటు బీచ్‌రోడ్‌ సమీప ప్రాంతాల్లో వచ్చే 30 నుంచి 40 నిమిషాల్లో మరోసారి వర్షం కురిసే అవకాశం ఉందని అలర్ట్‌ జారీ చేశారు.

ఈ స్టార్మ్‌ నెమ్మదిగా కదులుతుండటంతో భారీ వర్షం కంటే ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు అవసరం లేకుండా బయటకు రావొద్దని, బీచ్‌ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా ఇంకా వర్షాలు కొనసాగొచ్చని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement