
అడ్మిన్ బిల్డింగ్‌ను ముట్టడించిన కాంట్రాక్ట్ కార్మికులు
అక్రమ తొలగింపులకు నిరసనగా ఆందోళన
భారీగా మోహరించిన పోలీసులు
నేడు గేట్ల ముట్టడికి నిర్ణయం
ఉక్కు నగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగించవద్దని, ఇప్పటికే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్లతో ఈ నెల 20 నుంచి కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెలో ఉన్నారు. సోమవారం ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చాయి. మంగళవారం కార్మికులు పెద్దఎత్తున పరిపాలనా భవనం గేటు ఎదుట నిరసనకు దిగారు.
భారీగా తరలివచ్చిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఏసీపీ టి.త్రినాథ్ కార్మికులకు నచ్చచెప్పి శాంతియుతంగా ఆందోళన చేసుకోవాలని సూచించారు. దీంతో కార్మికులు అక్కడే బైఠాయించారు. మధ్యాహ్నం పోలీసులు వచ్చి ప్రతినిధి బృందాన్ని చర్చలకు పిలిచారు.
యాజమాన్య ప్రతినిధులతో జరిగిన చర్చల్లో తొలగించిన కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని, ఇకపై ఎవరినీ తొలగించకూడదని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఉన్నత యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడంతో చర్చలు ముగిశాయి.
టియర్ గ్యాస్, ఫైరింజన్‌తో వచ్చిన పోలీసులు
స్టీల్‌ప్లాంట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పోలీసులు ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టియర్ గ్యాస్‌తో కూడిన వజ్ర వాహనాన్ని పరిపాలనా భవనం ముందు ఉంచారు. గేటు లోపల సీఐఎస్‌ఎఫ్ ఫైర్ విభాగానికి చెందిన వాటర్ టెండర్‌ను సిద్ధం చేశారు. పోలీసులు, హోంగార్డులతో పాటు సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని పెద్దఎత్తున మోహరించారు. కాగా.. కార్మికుల ఆందోళనలో భాగంగా బుధవారం ఉక్కు మెయిన్ గేటు, బీసీ గేట్లను దిగ్భంధించాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సంఘాల నేతలు హెచ్చరించారు.