రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతా

Vijaya Sai Reddy Says Thanks To CM YS Jagan - Sakshi

రాజ్యసభకు రెండోసారి ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

సీఎం ఆశయాల మేరకు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తా 

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌ వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. తనపై నమ్మకం ఉంచి రాజ్యసభకు రెండోసారి ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్‌ జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసంలో మంగళవారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం తనపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతానని చెప్పారు. వచ్చే నెల నాటికి రాజ్యసభలో మొత్తం 9 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉంటే.. వారిలో ఐదుగురు బీసీలేనన్నారు. దీన్ని బట్టి బీసీలకు సీఎం జగన్‌ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇట్టే తెలుసుకోవచ్చన్నారు.

బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేస్తున్నారన్నారు. సమాజంలో మిగిలిన వర్గాలతో సమానంగా బడుగు, బలహీనవర్గాలను నడిపించాలన్న బలమైన ఆకాంక్ష సీఎం జగన్‌కు ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్‌.కృష్ణయ్య తెలంగాణకు చెందిన నేత అయినప్పటికీ ప్రాంతం చూడకుండా ఆయనను రాజ్యసభకు ఎంపిక చేశారని తెలిపారు.

బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలోకి తీసుకురావాలన్న ఆశయంలో భాగంగానే కృష్ణయ్యకు అవకాశమిచ్చారన్నారు. అభ్యర్థి ఎక్కడ వారన్నది అంత ముఖ్యం కాదని.. వారు బడుగు, బలహీనవర్గాల ప్రయోజనాలు.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలరా అనేది ముఖ్యమన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top