ఆంధ్రాలో మావోలకు ఎర్ర జెండా

Tribals do not join the ranks of the Maoists with social consciousness - Sakshi

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రిక్రూట్‌మెంట్‌కు చెక్‌

ఏవోబీలో 8 నుంచి 4కి తగ్గిన ఏరియా కమిటీలు

రెండు డివిజన్‌ కమిటీలు కనుమరుగు

ఒక్క ప్లాటూన్‌కే పరిమితం

ఛత్తీస్‌గఢ్, ఒడిశా వైపు విస్తరణ

గత రెండేళ్లలో 31 మంది లొంగుబాటు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు ఉద్యమ విస్తరణకు ఎర్ర జెండా పడింది. గత రెండేళ్లుగా గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉద్యమ విస్తరణపై తీవ్ర ప్రభావం చూపించాయి. ప్రభుత్వ పథకాలతో ఆర్థికంగా బలపడుతున్న గిరిజనులు సామాజిక చైతన్యంతో మావోయిస్టుల దరికి చేరడం లేదు. ప్రధానంగా ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌ (ఏవోబీ)లో రిక్రూట్‌మెంట్‌ నిలిచిపోవడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఉద్యమ పరిధి తగ్గిపోయింది. ఏవోబీలోని మావోయిస్టు పార్టీ దళాల్లో చేరేందుకు స్థానిక ఆదివాసీ యువత ఆసక్తి చూపడం లేదు.

ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులపై స్థానిక ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో మావోయిస్టులు తిరిగే వ్యూహాత్మక ఉద్యమ ప్రాంతాలు కుచించుకుపోతున్నాయి. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా రోడ్లు, సెల్‌ టవర్ల నిర్మాణంతో మైదాన ప్రాంతాలకు రాకపోకలు పెరగడంతో గిరిజనులు చైతన్యవంతులవుతున్నారు. ఏజెన్సీలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ గ్రామ స్థాయి సంఘాలు.. ఆదివాసీ విప్లవ రైతు కూలీ సంఘాలు (ఏవీఆర్‌సీఎస్‌), ఆదివాసీ విప్లవ మహిళా సంఘాలు (ఏవీఎంఎస్‌), విప్లవ ప్రజా కమిటీలు (ఆర్పీసీ), మిలీషియా కమిటీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆదివాసీ ప్రజల్లో పోలీసులు, ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి పెరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు మారుమూల ప్రాంతాలకు సైతం చేరడంతో మావోయిస్టులకు గిరిజనులు దూరమవుతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

కుచించుకుపోతున్న కమిటీలు..
ఏవోబీ ప్రాంతంలో ఏపీ నుంచి మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, ఒడిశా వైపు విస్తరించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కటాఫ్‌ ఏరియాను ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్కే), వివేక్‌లు పర్యవేక్షిస్తున్నారు. ఏవోబీలో రెండేళ్ల క్రితం మావోయిస్టులకు చెందిన ఎనిమిది ఏరియా కమిటీలు ఉంటే ఇప్పుడవి నాలుగుకు పరిమితమయ్యాయి. వాటిలో కలిమెల, నారాయణపట్నం, నందాపూర్, కాఫీదళం ఏరియా కమిటీలు కనుమరుగయ్యాయి. గాలికొండ, పెద్దబయలు, గుమ్మ, బోయపెరుగువాడ ఏరియా కమిటీలు మాత్రమే కొనసాగుతున్నాయి.

ఏవోబీలో రెండు డివిజన్‌ కమిటీలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) కంపెనీలు రెండు ఉండగా ఇప్పుడు ఒక్కటి మాత్రమే మిగిలింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి ఎనిమిది ఎదురు కాల్పులు జరగ్గా ఒక డివిజన్‌ కమిటీ సభ్యుడు, ఒక ఏరియా కమిటీ సభ్యుడితోపాటు మరో ఆరుగురు హతమయ్యారు. ఒక సెంట్రల్‌ జోన్‌ కమిటీ సభ్యుడు, ఒక డివిజన్‌ కమిటీ సభ్యుడు, ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ఇద్దరు పార్టీ సభ్యులు కలిపి మొత్తం ఆరుగురు అరెస్టు అయ్యారు. మొత్తం 31 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో స్టేట్‌ కమిటీకి చెందిన 11 మంది, ఏవోబీ ఎస్‌జెడ్‌సీకి చెందిన 20 మంది ఉన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top