పర్యాటకానికి 'జల'సత్వం 

Tourism department is preparing to resume boat travel in Krishna and Godavari rivers - Sakshi

‘కార్తీకం’లో ఆహ్లాదాన్ని పంచనున్న బోటు ప్రయాణం 

పైలెట్‌ బోటుతో పెట్రోలింగ్‌ 

కమ్యూనికేషన్‌ కోసం వెరీ హై ఫ్రీక్వెన్సీ రేడియోలు 

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ 

కృష్ణాలో నీటిమట్టం తగ్గిన వెంటనే బోటింగ్‌  

సాక్షి, అమరావతి: మరికొద్ది రోజుల్లో పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల్లో జలవిహారాన్ని పునఃప్రారంభించేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆగస్టులో ఈ రెండు నదుల్లో వరద ఉధృతి పెరగడంతో ముందస్తు చర్యల్లో భాగంగా బోటింగ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండడంతోపాటు కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో నవంబర్‌ 7 నుంచి గోదావరిలో పాపికొండలుకు బోట్లను తిప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పోశమ్మగండి నుంచే బోట్లు బయల్దేరుతాయి. కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని సింగనపల్లి బోటు పాయింట్‌ నీటిలో మునిగిపోయింది. దీంతో ఇక్కడ ప్రత్యామ్నాయ బోటింగ్‌ పాయింట్‌ను అన్వేషిస్తున్నారు. మరోవైపు.. కృష్ణానదిలో నీటి మట్టం తగ్గిన వెంటనే ఇక్కడా బోట్లు తిప్పనున్నారు.  

క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతులు 
రాష్ట్రంలో 300లకు పైగా బోట్లు ఉండగా.. ఇందులో పర్యాటక శాఖకు చెందినవి 48 ఉన్నాయి. వీటిలో మూడు మినహా మిగిలినవి అన్ని అనుమతులతో ప్రయాణికులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు.. ప్రభుత్వ స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ప్రకారం.. ప్రైవేటు బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అధికారులు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీచేస్తున్నారు. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, విజయవాడ బెరం పార్కులలో జల విహారానికి 50 సీట్ల సామర్థ్యం ఉన్న బోట్లను తిప్పుతున్నారు. అలాగే, రిషికొండ, రాజమండ్రి, దిండి ప్రాంతాల్లో చిన్నబోట్లు, జెట్‌ స్కీలను అందుబాటులో ఉంచారు. వాస్తవానికి పాపికొండలు మార్గంలో ఏపీ టూరిజం బోట్లతో పాటు దాదాపు 80 వరకు ప్రైవేటు బోట్లు రాకపోకలు సాగించేవి. ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడంతో కేవలం 23 బోట్లకు మాత్రమే అనుమతులు లభించాయి. 

నిరంతరం బోటింగ్‌ పర్యవేక్షణ 
రెండేళ్ల కిందట పాపికొండలు మార్గంలో కచ్చులూరు వద్ద సంభవించిన బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వ సూచనలతో బోట్ల రక్షణ, మార్పుల విషయంలో కాకినాడ పోర్టు అధికారులు ప్రత్యేక నివేదికను సమర్పించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఓపీని రూపొందించింది. దీని ప్రకారం..  
► బోట్ల రూట్‌ పర్మిట్, పర్యాటక, జలవనరుల శాఖ నుంచి లైసెన్సులు పొందితేనే బోటును నడుపుకునేందుకు ఎన్‌ఓసీ జారీచేస్తున్నారు.  
► గండిపోచమ్మ, పేరంటాలపల్లి, పోచవరం, రాజమండ్రి, రుషికొండ, నాగార్జునసాగర్, శ్రీశైలం, విజయవాడ బెరం పార్కులలో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటుచేశారు.  
► పోలీసు, రెవెన్యూ, జలవనరులు, పర్యాటక శాఖాధికారులు సమన్వయంతో వీటి ద్వారా బోటింగ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారు. 
► లైఫ్‌ జాకెట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు, పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు బోట్లను తనిఖీ చేస్తున్నారు.  
► బోటు బయలుదేరే ప్రదేశంతోపాటు గమ్యస్థానం వద్ద కూడా సీసీ కెమెరాలు, అలారంలను ఏర్పాటుచేశారు.
► ప్రైవేటు బోట్లలో సీటింగ్‌ సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించకుండా చర్యలు చేపడుతున్నారు. 

భద్రతా ప్రమాణాలతో సేవలు 
ఇక పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని బోట్లను సముద్ర యానానికి కూడా అనువైనవిగా తీర్చిదిద్దారు. 8 ఎంఎం స్టీల్‌ బాడీతో, ఇండియన్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ షిప్పింగ్‌ (ఐఆర్‌ఎస్‌) నిర్దేశిత భద్రతా ప్రమాణాలతో ఇవి సేవలందిస్తున్నాయి. ఈ బోట్లలో సమాచారాన్ని వేగంగా అందించేలా శాటిలైట్‌ ఫోన్లను ప్రవేశపెట్టారు. పాపికొండల మార్గంలో వీటిని వినియోగిస్తారు. ప్రయాణించే బోటుతోపాటు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్, పేరంటాలపల్లిలోని రిమోట్‌ కంట్రోల్‌ రూమ్‌లో వీటిని అందుబాటులో ఉంచారు. పాపికొండలుకు వెళ్లే బోట్లకు రక్షణగా ప్రత్యేక పైలట్‌ బోటుతో పెట్రోలింగ్‌ నిర్వహించనున్నారు. నావిగేషన్‌ వ్యవస్థతోపాటు కమ్యూనికేషన్‌ కోసం వెరీ హై ఫ్రీక్వెన్సీ (వీహెచ్‌ఎఫ్‌) రేడియోలతో బోట్లను నడపనున్నారు. 

పాపికొండలుకు విహారయాత్ర 
గోదావరి, కృష్ణాలో బోటు షికారుకు ఏర్పాట్లుచేస్తున్నాం. పర్యాటక శాఖకు చెందిన 45 బోట్లకు పోర్టు అనుమతులున్నాయి. కార్తీక మాసంలో పర్యాటకుల సందడిని దృష్టిలో పెట్టుకుని నవంబర్‌ 7 నుంచి పాపికొండల విహార యాత్రను అన్ని జాగ్రత్తలతో ప్రారంభిస్తున్నాం. అదే రోజున కృష్ణాలో కూడా బోట్లు తిప్పేందుకు జలవనరుల శాఖ అధికారులతో చర్చిస్తున్నాం.  
– ఎస్‌.సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top