గ్రీన్‌ చానల్‌తో సకాలంలో ఆక్సిజన్‌ సరఫరా

Timely oxygen supply with green channel - Sakshi

వైజాగ్‌ నుంచి గుంటూరుకు రవాణా

గుంటూరు జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ కొరత 

గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేసి సకాలంలో ఆక్సిజన్‌ తెప్పించిన పోలీసులు

సాక్షి, గుంటూరు: కరోనా రోగులకు కీలకంగా మారిన ఆక్సిజన్‌ను గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేసి పోలీసులు సకాలంలో తెప్పించారు. వివరాల్లోకెళ్తే.. గుంటూరు జీజీహెచ్‌లో 800 పడకల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు సాధారణ రోగులు కూడా ఇక్కడ వందల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి విశాఖపట్నం నుంచి ఆక్సిజన్‌ సరఫరా అవుతుంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం విశాఖపట్నం నుంచి 10 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ బయల్దేరింది. ఇది సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ లోపే ఆక్సిజన్‌ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని జీజీహెచ్‌ వైద్యులు గుర్తించారు. దీంతో ఆర్‌ఎంవో డాక్టర్‌ సతీష్‌ కొత్తపేట సీఐ రాజశేఖర్‌రెడ్డికి ఉదయం 11 గంటల ప్రాంతంలో విషయం తెలియజేశారు.

ఆక్సిజన్‌ లోడ్‌తో వస్తున్న ట్యాంకర్‌ డ్రైవర్‌కు సీఐ ఫోన్‌ చేయగా ఏలూరుకు అవతల ఉన్నట్టు తెలిపాడు. దీంతో సీఐ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన డీఐజీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి.. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, విజయవాడ కమిషనర్‌ శ్రీనివాసులును, స్టేట్‌ కోవిడ్‌–19 కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ అధికారులను అప్రమత్తం చేశారు. ఆక్సిజన్‌ ట్యాంకర్‌తో వస్తున్న లారీకి ఎక్కడ ట్రాఫిక్‌పరంగా ఇబ్బందులు తలెత్తకుండా హైవే పెట్రోలింగ్, పోలీస్‌ వాహనాలను పైలెట్‌గా ఉంచి గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేశారు. దీంతో ఆక్సిజన్‌ ట్యాంకర్‌ చేరుకోవాల్సిన సమయం కంటే గంటన్నర ముందు అంటే మ«ధ్యాహ్నం 2.20 గంటలకే గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుంది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top