ఏవోసీబీలో కూంబింగ్‌ ముమ్మరం

Three State Police Joint Operation In AOCB For Maoists - Sakshi

మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో విస్తృత గాలింపు

మూడు రాష్ట్రాల పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రా–ఒడిశా–ఛత్తీస్‌గఢ్‌ (ఏవోసీబీ) సరిహద్దుల్లోని ట్రై జంక్షన్‌ ప్రాంతంలో పోలీసు బలగాలు విస్తృతంగా కూంబింగ్‌ చేస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేతల కదలికల నేపథ్యంలో మన్యాన్ని జల్లెడపడుతున్నాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మంగళవారం, విశాఖ మన్యంలో బుధవారం జరిగిన వరుస ఎన్‌కౌంటర్లతో మన్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎదురుకాల్పుల నుంచి కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్‌ అలియాస్‌ మహేందర్‌రెడ్డి, అరుణ తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశానికి అర కి.మీ. దూరంలోని మరో ప్రాంతంలో వారు ఉండటంతో కాల్పుల మోత వినగానే తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది మావోయిస్టుల రక్షణతో వారు ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్‌ సరిహద్దుల్లోని కట్‌ ఆఫ్‌ ఏరియాలోని ట్రై జంక్షన్‌ వైపు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. అందుకే వారి కోసం మూడు వైపుల నుంచి కుంబింగ్‌ను ముమ్మరం చేశారు.

ట్రై జంక్షన్‌లోనే అగ్రనేతలు?
ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ (ఏఓబీజెడ్‌సీ) ఆధ్వర్యంలో మళ్లీ కేడర్‌ను బలోపేతం చేసుకోవాలని మావోయిస్టులు సన్నద్ధమవుతన్నట్లు నిఘా వర్గాలకు స్పష్టమైన సమాచారం అందింది. జూన్‌–జులైలలో అందుకోసం పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారని కూడా పసిగట్టాయి. దీంతో బస్తర్‌ కేంద్రంగా మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు గత నెలలో సమావేశమైనట్లు సమాచారం. వరుస లొంగుబాట్లు, ఆనారోగ్య సమస్యలతోపాటు కరోనాతో కూడా మావోయిస్టులు గత కొద్దిరోజులుగా బలహీనపడిన నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా గాలింపు చర్యలు చేపట్టాలని వారు నిర్ణయించారు. శిక్షణా తరగతుల నిర్వహణకు ఇతర ప్రాంతాల నుంచి అగ్రనేతలు వచ్చేవరకు వేచి చూడాలని ముందుగానే నిర్ణయించారు. ఇంతలో అగ్రనేతలు చేరుకున్నారన్న సమాచారం రావడంతో గ్రేహౌండ్స్, కోబ్రా, ఎస్‌పీఎఫ్, ఐటీబీటీ, బీఎస్‌ఎఫ్‌ బలగాలు సంయుక్తంగా జూన్‌ రెండోవారం నుంచి కూంబింగ్‌ను విస్తృతం చేశాయి. ఈ నేపథ్యంలో.. ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో సోమ, మంగళవారాల్లో జరిగిన ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకోగా.. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం తీగలంమెట్ట వద్ద బుధవారం ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు డివిజన్‌ కమిటీ సభ్యులతోపాటు ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనలతో మల్కనగిరి, విశాఖ మన్యంలలో ఎన్‌కౌంటర్లపై మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించి కూంబింగ్‌ను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్, అరుణలు 40 మంది మావోయిస్టుల రక్షణతో ట్రై జంక్షన్‌కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దాంతోపాటు ఏఓబీజెడ్‌సీ ఇన్‌చార్జ్‌ డుడుమలతోపాటు మరికొందరు అగ్రనేతలు ఆ ప్రాంతంలోనే ఉండొచ్చన్నది పోలీసు ఉన్నతాధికారుల అంచనా. అగ్రనేతల్లో ఎవరు ఉండొచ్చన్న దానిపై అప్పుడే ఏమీ చెప్పలేమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కానీ, ఆ ప్రాంతంలో భారీస్థాయిలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని.. ఇన్‌ఫార్మర్లు చెప్పినదాన్ని బట్టి ఒకరిద్దరు అగ్రనేతలు కూడా ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. దీంతో ఏఓసీబీలో పోలీసు బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top