‘సీమ’ ఆదాయం అమరావతిలో ఖర్చు | There is gross financial abuse going on in the state says ysrcp | Sakshi
Sakshi News home page

‘సీమ’ ఆదాయం అమరావతిలో ఖర్చు

Apr 23 2026 4:00 AM | Updated on Apr 23 2026 4:00 AM

There is gross financial abuse going on in the state says ysrcp

‘సీమ సాగునీటి ప్రాజెక్టులు–సమాలోచనలు’ సభకు హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు

రాష్ట్రంలో దారుణంగా ఆర్థిక దుర్వినియోగం జరుగుతోంది 

రూ.200 కోట్లు ఖర్చుచేస్తే ‘సీమ’ లిఫ్ట్‌ పూర్తవుతుంది 

రాజకీయ కారణాలతోనే దీనిపై సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం 

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఇప్పటివరకు ఆయనెందుకు ఖండించలేదు? 

పార్టీలకతీతంగా అందరూ ఉద్యమానికి కలిసి రావాలి 

‘సీమ సాగునీటి ప్రాజెక్టులు–సమాలోచనలు’ సభలో ‘గ్రేటర్‌’ నేతలు

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేయాలని కడప, తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాలలో మూణ్ణెళ్లుగా ఉద్యమం జరు­గుతోంది. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు స్పందించ లేదు. ఈ ప్రాంతంపై ఆయనకు మంచి ఉద్దేశం లేకపోవడమే దీనికి కారణం. రాష్ట్రంలో దారుణంగా ఆర్థిక దుర్వినియోగం జరుగుతోంది. 

‘సీమ’ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం మొత్తాన్ని అమరావతిలో ఖర్చు చేస్తున్నారు..’ అని పలువురు నేతలు మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్‌ను నిర్మించాలని ‘గ్రేటర్‌’ నేతలు మూడు నెలలుగా ఉద్యమిస్తున్న క్రమంలో నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘రాయలసీమ ప్రాజెక్టులు–సమాలోచనలు’ పేరుతో బుధవారం నంద్యాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏమన్నారంటే... 

‘కృష్ణా’పై నిర్మిస్తున్న ప్రాజెక్టులతో ‘సీమ’, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు భవిష్యత్తులో నీటి కష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో రాయ­లసీమ లిఫ్ట్‌ పనులు ప్రారంభించగా అవి దాదాపు పూర్తయ్యాయి. రూ.200 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తయి సీమకు నీరందుతుంది. కానీ, రాజకీయ కారణాలతో చంద్రబాబు ఈ పనులు చేయడం లేదు. మన ప్రాంత ఆదాయాన్ని కూడా మన ప్రాంతానికి ఖర్చు చేయడం లేదు. కుప్పానికి నీళ్లిచ్చానని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం ప్రజలకు మాటిచ్చి, పనులుచేసి, ప్రారంభించారు. జగన్‌కు దక్కాల్సిన క్రెడిట్‌ కూడా చోరీ చేస్తున్నారు.  

రేవంత్‌ ప్రకటనపై బాబు స్పందించలేదు 
తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే చంద్రబాబును ఒప్పించి రాయలసీమ లిఫ్ట్‌ ఆపించానని రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించ లేదు. ఇక కర్ణాటకలోని ఆల్మట్టి, అప్పర్‌ భద్ర పూర్తయితే 138 టీఎంసీలు తగ్గిపోయి శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుతుంది. శ్రీశైలానికి నీరు రాకముందే నెట్టెంపాడు వద్ద తెలంగాణ తోడేస్తోంది. రోజూ ఎనిమిది టీఎంసీ­లు తెలంగాణ తీసుకెళ్తే పోతిరెడ్డిపాడుకు చుక్కనీరు అందదు. అందుకే రాయలసీమ లిఫ్ట్‌ చేపట్టాం. దీని నిర్మాణం కోసం పార్టీలకతీతంగా అందరినీ కలు­పుకుని ఉద్యమిస్తాం. 

ఈ అంశంలో రాజకీ­యాలకు అతీతంగా అంతా కలిసి రావాలి. చంద్రబాబు సీమకు ఎప్పు­డూ న్యాయం చేయలేదు. ‘సీమ’ ఆదా­యా­న్ని చంద్రబాబు ముంపు ప్రాంత­మైన అమరావతికి ఖర్చుచేస్తున్నారు. ఏ రోజుకైనా కృష్ణా పొంగడం, అమరావతి మునగడం ఖాయం. ‘సీమ’కు జరుగుతున్న అన్యాయాలపై వైఎస్సార్‌సీపీ మినహా ఎవ్వ­రూ ప్రశ్నించడంలేదు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన వ్యక్తి కూడా పత్తాలేడు... అని నేతలు అన్నారు. సభలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా­రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, శైలజానాథ్, బుగ్గన రాజేంద్రనాథ్, జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement