
ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 1,85,734 సీట్లు
11 గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లో మరో 13వేల సీట్లు
ఐదు డీమ్డ్ వర్సిటీల్లో మరో 10వేలకుపైగా..
225 ప్రైవేటు, 18 ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు
వీటిలో కంప్యూటర్ సైన్స్ సీట్లు 1,02,614
ఆ తర్వాత అత్యధికంగా ఈసీఈలో 32,330 సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్ డిగ్రీ సీట్లు గణనీయంగా పెరిగాయి. రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా ఇంజినీరింగ్ కోర్సుల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గత నెల 30 నాటికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల్లో కోర్సుల సీట్ల అనుమతులు ప్రక్రియను పూర్తి చేసింది. మంగళవారం ఏపీ సాంకేతిక విద్యామండలి (2025–26 విద్యా సంవత్సరానికి ఏఐసీటీఈ అనుమతించిన సీట్ల వివరాలను) వెల్లడించింది. వీటిలో 243 ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 1,85,734 సీట్లు అందుబాటులో ఉండగా.. ఒక్క కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లోనే 1,02,614 సీట్లు ఉండటం విశేషం.
ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో 32,330 సీట్లు ఉన్నాయి. ఇక 11 గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ వంటి ప్రైవేటు వర్సిటీల్లో 13 వేల సీట్లు, డీమ్డ్ వర్సిటీల్లో మరో 10 వేలకుపైగా సీట్లు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే రెండు ప్రభుత్వ కళాశాలలు పెరగ్గా.. ఐదు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు తగ్గాయి. మొత్తం 2024–25లో 245 కళాశాలలు ఉంటే ఇప్పుడు 243 కళాశాలలు మాత్రం ఇంజినీరింగ్ కోర్సులను అందించనున్నాయి.
కన్వీనర్ కోటాలో 70 శాతం భర్తీ
1,85,734 సీట్లలో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో ప్రభుత్వం భర్తీ చేయనుంది. గ్రీన్, బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం, 35శాతం ప్రాతిపదికన సీట్లను కన్వీనర్ కోటాలో కేటాయిస్తారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఆచార్య నాగార్జున వర్సిటీలో కొత్తగా సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో 60 సీట్ల చొప్పున 180 సీట్లు, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో వీఎల్‌ఎస్‌ఐ ఇంజినీరింగ్, క్వాంటం కంప్యూటింగ్‌లో 60 సీట్ల చొప్పున 120 సీట్లు, కృష్ణా యూనివర్సిటీలో ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో 60 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.
కొత్తగా రెండు కళాశాలలు ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు అనుమతులు పొందాయి. ఇందులో ప్రకాశం జిల్లాలోని ఏడుగుండ్లపాడులో శ్రీహర్షిణి ఇంజినీరింగ్ కాలేజీలో 360 సీట్లు, కృష్ణా జిల్లాలోని అక్కినేని నాగేశ్వరరావు ఇంజినీరింగ్ కాలేజీలో 240 సీట్లు కొత్తగా చేరాయి. మొత్తంగా ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో 360 సీట్లు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 19,974 సీట్లు పెరిగాయి.