
శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం పెద్దపల్లిపేటలోని కోదండ రామాలయంలో ధ్వంసం చేసిన వామనావతార విగ్రహం
కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఘటనలు
జనవరిలో ఏకాదశి రోజున తిరుపతిలో ఆరుగురు భక్తుల దుర్మరణం
ఏప్రిల్‌లో శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత
సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గోడకూలి ఏడుగురు బలి
తాజాగా కళింగపట్నం వైష్ణవాలయంలో ఏడు విగ్రహాల ధ్వంసం
వరుస ఘటనలతో దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు.. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ సభ్యుల నిరసన
గార: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలు హిందూవుల మనసులను కలచివేస్తున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలలో శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో రెండురోజుల వ్యవధిలో 15 నక్షత్ర తాబేళ్లు మృత్యువాతపడడం, ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా సింహాచలంలో చందనోత్సవ సమయంలో గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మరణించడం వంటి హృదయ విదారక ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి.
ఈ విషాద ఘటనలు మరువక ముందే శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం పెద్ద పల్లిపేటలోని కోదండ రామాలయంలో మరో ఘోర అపచారం జరిగింది. ఈ గుడిలోని బాలశశిశేఖర ఆలయం (వైష్ణవాలయం)లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏడు విగ్రహాలను ధ్వంసం చేశారు. దాదాపు 300 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం గర్భగుడిని స్థానికులు విరాళాలు పోగు చేసి బాగు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా గుడి చుట్టూ దశావతారాలను సిమెంట్ విగ్రహాలతో ఏర్పాటు చేశారు. వీటిలో వామనావతరం విగ్రహాన్ని దుండగులు పూర్తిగా పెకిలించి వేశారు.
కలి్క, బలరామ, శ్రీరాముడు, పరశురామ, నరసింహ, శ్రీకృష్ణుడు విగ్రహాల చేతులు విరిగిపోయి ఉన్నాయి. కొన్ని విగ్రహాలకు కత్తి, నాగలి, పిల్లనగ్రోవి వంటివి పాడైపోయాయి. ఎవరో కావాలనే ఈ పని చేశారని అనుమానిస్తున్నారు. ఈ ఆలయానికి ఒకవైపు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. ఇక్కడ మందుబాబులు ఎక్కువగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం స్వీపర్ గొండు చిన్నమ్మడు వెనుక వైపు వెళ్లి చూడగా విగ్రహాలన్నీ కొన్ని చోట్ల విరిగిపోయి ఉండటం గమనించి అర్చకులకు తెలియజేసింది.
అర్చకులు మహేంద్రాడ లక్ష్మణమూర్తి, కోదండరామాచార్యులు, చామర్తి రామగోపాలచార్యులు ఆలయ ఈఓకు, స్థానిక పెద్దలకు తెలియజేశారు. వాళ్లు పోలీసులకు సమాచారం అందజేశారు. రెండు ఆలయాల్లోని రెండు సీసీ కెమెరాలు గత పదిహేనురోజులుగా పనిచేయడం లేదు. ఘటన జరిగిన తర్వాత విరిగిపోయిన విగ్రహాలకు వెంటనే మరమ్మతులు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నరసన్నపేట గ్రూప్ టెంపుల్స్ ఇన్‌చార్జి ఈఓ మాధవి విగ్రహాల ధ్వంసంపై గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
హిందూ సంఘాల నిరసన
ఆలయాన్ని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద పరిశీలించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు, ఇన్‌చార్జి ఎస్‌ఐ ఎం.హరికృష్ణ ఉన్నారు. జిల్లా దేవదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పటా్నయిక్ ఆలయాన్ని పరిశీలించారు. విగ్రహాల ధ్వంసంపై విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ సభ్యులు ఆలయం వద్ద నిరసన చేపట్టారు. బీజేపీ మండల అధ్యక్షురాలు మైలపల్లి లక్ష్మీజనార్దన్, రాష్ట్ర నాయకులు పండి యోగీశ్వరరావు ఆలయాన్ని పరిశీలించారు.