మనిషికో వంద.. టీడీపీ దందా

TDP Party membership in name of insurance - Sakshi

బీమా పేరిట పార్టీ సభ్యత్వం

బలవంతంగా రూ.100 వసూలు

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కుయుక్తులు

అడ్డుకున్న సర్పంచ్‌ భర్త

అనంతపురం జిల్లాలోనూ ఇదే రకం దందా

కుప్పం/డి.హీరేహాళ్‌ (రాయదుర్గం): రాష్ట్రంలో నానాటికీ క్షీణించిపోతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ప్రజలెవ్వరూ ముందుకు రావడంలేదు. దీంతో ఆ పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. బీమా పేరుతో ప్రతి మనిషి నుంచి బలవంతంగా వంద రూపాయలు వసూలు చేసి, సభ్యత్వ రశీదు ఇస్తున్నారు. దీంతో ప్రజలు వారిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ్యత్వ నమోదుకు కొన్ని చోట్ల వ్యక్తిగత బీమా అని, మరికొన్ని చోట్ల పంటల బీమా అంటూ గ్రామీణులను మోసం చేస్తున్నారు.

చివరకు ఆ పార్టీ అధినేత సొంత నియోజకవర్గం కుప్పంలోనూ సభ్యత్వాలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో బీమా పేరుతో మాయమాటలు చెప్పారు. వంద రూపాయలు చెల్లించి టీడీపీ సభ్యత్వం తీసుకుంటే ప్రమాదవశాత్తు గాయపడిన వారికి బీమా, వైద్య ఖర్చులు, మరణించిన వారి కుటుంబానికి రూ. 5 లక్షలు వస్తుందని చెబుతున్నారు. వద్దన్న వారికి కూడా బలవంతంగా రశీదులు రాసి, డబ్బు వసూలు చేస్తున్నారు.

ఇదే విధానంలో రామకుప్పం మండలం పెద్దూరు గ్రామంలో రాత్రి పూట ఇన్సూరెన్స్‌ పేరుతో సభ్యత్వ నమోదుకు దిగిన టీడీపీ నేతలను స్థానికులు, సర్పంచ్‌ భర్త గోవిందప్ప అడ్డుకున్నారు. వద్దంటున్నా, బలవంతంగా రశీదులు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. దీంతో ఆ నేతలు మెల్లగా జారుకున్నారు. ఇప్పటికీ పలు గ్రామాల్లో ఇదేవిధంగా మాయమాటలతో ప్రజలకు బలవంతంగా సభ్యత్వం రశీదులు ఇస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

సభ్యత్వ నమోదుకు వచ్చిన టీడీపీ నాయకుడితో స్థానికుల వాగ్వాదం   

అనంతపురం జిల్లాలోనూ..
అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం కల్యంలో మిర్చి పంటకు బీమా ఇప్పిస్తామంటూ రైతుల నుంచి బుధవారం రాత్రి అక్రమ వసూళ్లకు తెగబడి అడ్డంగా దొరికిపోయారు. రాయదుర్గం పట్టణానికి చెందిన కొంత మంది టీడీపీ నాయకులు గ్రామంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. మనిషికో రూ.వంద చెల్లిస్తే మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుతో మాట్లాడి ఇన్సూ్యరెన్స్‌ వచ్చేలా చేస్తామని నమ్మబలికారు.

టీడీపీకి సభ్యత్వం చేస్తే పంటల బీమా ఎలా ఇప్పిస్తారని రైతులు నిలదీశారు.  దీంతో గ్రామంలో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో టీడీపీ నాయకులు అబ్దుల్‌ గఫూర్, పరమేశ్వర, గంగన్న, ధనుంజయ, రుద్రప్ప, ఓబన్న, జావిద్‌ అక్కడి నుంచి జారుకున్నారు. కృష్ణ అనే టీడీపీ నాయకుడు మాత్రం పట్టుబడ్డాడు. అతన్ని పోలీసులు హెచ్చరించి వదిలేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top