
అనంతపురం: భర్తను కోల్పోయిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలను వెంట బెట్టుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. కొంతకాలంగా కూలి పనులు చేసుకుంటూ కన్న వారిని, పిల్లలను పోషించుకుంటోంది. ఆమె పెద్ద కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. తన కూతురిని ఏదైనా హాస్టల్‌లో ఉంచి చదివిస్తే..తనకు భారం కొద్దివరకైనా తగ్గుతుందని భావించింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని కేజీబీవీలో ప్రవేశానికి సంబంధించిన పత్రాలను సిద్ధం చేసుకుంటుండగా బ్రహ్మసముద్రానికే చెందిన ఓ టీడీపీ నాయకుడు గమనించాడు.
తాను టీడీపీ మండల కన్వీనర్ అనుచరుడినని, తాను ఫోన్ చేసి చెబితే..ఏ స్కూల్‌లో అయినా సీటు గ్యారంటీ అని నమ్మించాడు. ఓ అన్నలా సాయం చేయడానికి ముందుకు వచ్చాడని ఆమె భావించింది. తాను ఫోన్‌లో మాట్లాడి సీటు విషయం చెబుతానంటూ ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. మరుసటి రోజే ఆమెకు ఫోన్ చేసి సీటు కావాలంటే కొంత ఖర్చవుతుందని చెప్పాడు. ఎంతవుతుందని అడగ్గా..రూ.10 వేలు ఇవ్వాలన్నాడు. అంత డబ్బు ఇచ్చుకోలేననడంతో ‘నువ్వు ఊ అంటే నీ కూతురు చదువుకునేందుకు స్కూల్ తో పాటు హాస్టల్ సీటు కూడా ఇప్పిస్తా’ అని అన్నాడు. దీంతో ఆమె సదరు టీడీపీ కార్యకర్తకు మాటలతో బుద్ధి చెప్పింది.
అయినా అతడు వదల్లేదు. అదే రోజు రాత్రి మళ్లీ ఫోన్ చేసి..‘సమాజంలో ఇలాంటివి సహజం. నీ ఒంటరి జీవితానికి తోడుగా ఉంటా. నీ పిల్లల జీవితానికి అన్ని విధాలుగా అండగా ఉంటా. మా నాయకుడితో చెప్పి ఆ స్కూల్లో నీ కూతురికి సీటు ఇప్పిస్తా. నీకు కూడా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి జీతం వచ్చేలా చేస్తాను’ అంటూ లొంగదీసుకునేందుకు యతి్నంచాడు. అతడి చేష్టలకు విసిగిపోయిన బాధితురాలు తన సన్నిహితులతో ఈ విషయాన్ని చెప్పి ఆవేదన చెందింది. అలాగే ఆమె ఆవేదన చెందుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.