
టీడీపీ రౌడీల దాడిలో ధ్వంసమైన వాహనం
దాడులు కాదు.. ఇక హత్యకాండకు తెగబడండి!
టీడీపీ రౌడీమూకలకు ప్రభుత్వ పెద్దల ఆదేశం
స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో బరితెగింపు
ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా బీభత్సకాండ.. బందిపోటు ముఠాల తరహాలో వాహనాల్లో వచ్చి పచ్చముఠాల కిరాతకం..
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, వేల్పుల రాముపై హత్యాయత్నం.. పట్టపగలు నడిరోడ్డుపై మారణాయుధాలతో దాడి
బాధితులు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం.. అరెస్టులు అసలే లేవు
తమ కళ్లెదుటే టీడీపీ గూండాలు స్వైర విహారం చేస్తున్నా పోలీసుల ప్రేక్షక పాత్ర
ప్రజలను పట్టి పీడించే పిండారీలు, జంతువులను వేటాడే ఆది మానవ తెగలను తలదన్నే రీతిలో పచ్చ ముఠాలు అత్యంత క్రూరంగా, కిరాతకంగా వ్యవహరిస్తున్నాయి. బందిపోటు ముఠాల మాదిరిగా 10 వాహనాల్లో ప్రత్యక్షమై మెరుపు దాడులకు తెగబడుతున్నాయి. గుంపులు గుంపులుగా వాహనాల్లో సంచరిస్తూ మారణాయుధాలు చేతబూని విచక్షణా రహితంగా విరుచుకుపడుతున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పులివెందులలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు కూటమి సర్కారు ఆటవిక పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
టీడీపీ గూండాలను ఉసిగొల్పిన ప్రభుత్వ పెద్దలు స్థానిక ఎన్నికల్లో రౌడీ రాజకీయాలకు తెర తీశారు. తమ ముందే బరి తెగించి దాడులకు దిగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా అరెస్టు చేయకపోగా కనీస చర్యలు కూడా తీసుకునే పరిస్థితిలో పోలీసు శాఖ లేదు. సర్కారు అండతో నల్లగొండువారిపల్లెలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, వేముల మండల పార్టీ పరిశీలకుడు వేల్పుల రామలింగారెడ్డిపై టీడీపీ మూకలు బుధవారం నడిరోడ్డుపై పట్టపగలే హత్యాయత్నానికి పాల్పడ్డాయి.
వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి రమేశ్‌యాదవ్, రామలింగారెడ్డిలను తీవ్రంగా గాయపరిచాయి. అంతకుముందు మంగళవారం సాయంత్రం పులివెందులలో మరో ఘటనలో.. ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులపై ఫంక్షన్ హాల్‌లోనే టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో అమరేష్‌రెడ్డి, సైదాపురం సురేష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లివారిని, శ్రీకాంత్, నాగేశ్ తదితరులను దారుణంగా కొట్టారు. దాదాపు 100 మందికిపైగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బైండోవర్ చేసిన పోలీసులు ఘటనలకు కారకులైన టీడీపీ శ్రేణుల వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు.
సాక్షి, అమరావతి: ఏడాది పాలనలోనే వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తీవ్ర అసహనంతో హత్యా రాజకీయాలకు పురిగొల్పుతోంది. రెడ్‌బుక్ కుట్రలతో ఏడాదిగా రాష్ట్రంలో సాగిస్తున్న అధికారిక దౌర్జన్యకాండను మారణకాండగా మార్చేందుకు టీడీపీ గూండాలకు లైసెన్స్ ఇచ్చేసింది. అయితే పచ్చ ముఠాల అరాచకాలు, ఆగడాలతో సీఎం చంద్రబాబు సంతృప్తి చెందడం లేదని స్పష్టమవుతోంది. అందుకే పట్టపగలు ఆయుధాలు చేతబట్టి నడిరోడ్డుపై హత్యలకు తెగబడమని పచ్చ జెండా ఊపేశారు.
పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ గూండాలు పక్కా పన్నాగంతో మారణాయుధాలు, పెట్రోల్ సీసాలతో వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యాయత్నానికి తెగబడటమే అందుకు తాజా నిదర్శనం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇటీవల టీడీపీ కార్యకర్తల సమావేశాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటన్నది వైఎస్సార్‌సీపీ నేతలపై జరుగుతున్న తీవ్రమైన దాడులు, హత్యాయత్నాలు వెల్లడిస్తున్నాయి.
‘దాడులు, హత్యాయత్నాలకు పాల్పడండి..! మేం చూసుకుంటాం..!’ అన్నట్టుగానే వారిద్దరూ వ్యాఖ్యానించడం గమనార్హం. అందుకోసం టీడీపీ గూండాలతోపాటు గంజాయి గ్యాంగ్‌లను ఉసిగొల్పారు. టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న బెల్ట్ దుకాణాలు, కల్తీ మద్యం కిక్కుతో రౌడీమూకలు, అసాంఘిక శక్తులు, ఆకతాయిలు విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చి కత్తులు, ఇతర ఆయుధాలు చేతబట్టి స్వైర విహారం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న ఈ అధికారిక అరాచక కాండ, హత్యా రాజకీయాలకు పోలీస్ యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే ఉదాసీన వైఖరితో వత్తాసు పలుకుతోంది.
‘స్థానిక’ ఎన్నికల్లో అక్రమాలకే హత్యా రాజకీయాల కుట్ర..!
కూటమి సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని టీడీపీ నేతలు బెంబేలెత్తుతున్నారు. దీంతో యథేచ్చగా అక్రమాలకు పాల్పడి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని పన్నాగం రచించారు. దాడులు, దౌర్జన్యాలే కాదు.. హత్యలకు కూడా తెగబడాలని కూడా టీడీపీ రౌడీమూకలకు ఆ పార్టీ అధిష్టానం పచ్చ జెండా ఊపింది. ఈ హత్యా రాజకీయాలకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను చంద్రబాబు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేసుకుంది.
ఏకంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, వేముల మండల నేత వేల్పుల రామలింగారెడ్డి (రాము)లను పట్టపగలు నడిరోడ్డుపై హతమార్చేందుకు పచ్చముఠాలు యత్నించాయి. పార్టీ నేతలతో మాట్లాడేందుకు నల్లగొండువారిపల్లెకు ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్, వేల్పుల రాము వెళ్లిన విషయం పసిగట్టిన టీడీపీ గూండాలు వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో హత్యాయత్నానికి తెగబడ్డారు.
దీంతో అరగంట పాటు గ్రామంలో భీతావహ పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ కడప జిల్లాల్లో క్రమం తప్పకుండా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, హత్యాయత్నాలకు తెగబడతామని టీడీపీ గూండాలు ఈ ఉదంతం ద్వారా స్పష్టం చేశారు. తద్వారా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీ బహిష్కరించేలా చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఎంతకైనా తెగిస్తామని సంకేతాలిస్తూ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, పార్టీ నేత వేల్పుల రాములపై హత్యాయత్నానికి తెగబడింది.
వైఎస్ జగన్ పర్యటనలను అడ్డుకునే కుట్ర..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ అరాచక పర్వానికి బరి తెగిస్తుండటం కూటమి ప్రభుత్వ కుతంత్రానికి నిదర్శనం. ఆయన పర్యటనల్లో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని ఇటీవల పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పొగాకు రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించినప్పుడు టీడీపీ గూండాలు దారిలో మాటు వేయడం తీవ్ర ఆందోళన కలిగించింది. అనుమతి లేకపోయినా టీడీపీ నేతలు, గూండాలను ఆ మార్గంలోకి పెద్ద ఎత్తున పోలీసులు అనుమతించడం గమనార్హం.
టీడీపీ గూండాల గుంపు వైఎస్ జగన్ కాన్వాయ్‌పై దాడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనలోనూ అసాంఘిక శక్తులు చొరబడటం గమనార్హం. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ముసుగులో అరాచక ముఠాలు ఏకంగా వైఎస్ జగన్ వాహనం వరకు చొచ్చుకు వస్తున్నా పోలీసులు చోద్యం చూశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనలో అడుగడుగునా రభస సృష్టించేందుకు టీడీపీ యత్నించింది. తద్వారా వైఎస్ జగన్ పర్యటనల్లో ఘర్షణలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్నదే ప్రభుత్వ కుట్ర అన్నది స్పష్టమవుతోంది. ఆ నెపంతో వైఎస్ జగన్ పర్యటనలకు అనుమతి ఇవ్వకూడదన్నది ప్రభుత్వ పెద్దల దురాలోచన!!
నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనూ బరితెగింపు
చంద్రబాబు సర్కారు దారుణ వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ గూండాలు హత్యాయత్నాలకు తెగబడుతున్నారు. ఇటీవల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గూండాలు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంపై దాడి చేసి పెను విధ్వంసం సృష్టించారు.
ప్రసన్న కుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు పక్కా పన్నాగంతోనే ఈ దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో ఆయన లేకపోవడంతో నివాసం, ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లాలోనూ జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక దంపతులను అంతమొందించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ గూండాలు విధ్వంస కాండ సృష్టించారు. గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమం సన్నాహక సమావేశానికి వస్తున్న ఆమెను లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె వాహనంపై దాడి చేశారు.
పచ్చమూకలకు మందు, గంజాయి
హత్యా రాజకీయాలతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా పన్నాగం పన్నింది. మద్యం సిండికేట్, గంజాయి మాఫియాను అందుకు సాధనంగా చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా 75 వేల బెల్ట్ షాపులను టీడీపీ సిండికేట్ నిర్వహిస్తోంది. వాటి ద్వారా సాధారణ మద్యంతోపాటు సైకోలుగా మార్చే అత్యంత ప్రమాదకర స్పిరిట్‌తో కూడిన కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తోంది. మరోవైపు విశాఖ టీడీపీ సీనియర్ నేతల కుటుంబాల ఆధ్వర్యంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) కేంద్రంగా గంజాయి మాఫియా రాష్ట్రవ్యాప్త దందా సాగిస్తోంది. మద్యం, కల్తీ మద్యం, గంజాయిలను రౌడీమూకలకు అందిస్తూ టీడీపీ సిండికేట్ వారిని పెంచి పోషిస్తోంది.
తాము కనుసైగ చేసిన వెంటనే పల్లెలు, పట్టణాల్లో అలజడులు, విధ్వంసం సృష్టించేందుకు రంగంలోకి దింపుతోంది. తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, హత్యాయత్నాలకు వారిని వాడుకుంటోంది. నెల్లూరులో మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై దాడి చేసి విధ్వంసం సృష్టించింది టీడీపీ గంజాయి గ్యాంగే. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక దంపతులపై హత్యాయత్నానికి తెగబడింది టీడీపీ నేతలు, కల్తీ మద్యం సైకో బ్యాచ్‌నే. ఇక పులివెందుల నియోజకవర్గం నల్లగొండువారిపల్లెలో ఏకంగా కత్తులు, సమ్మెట్లుతో దాడి చేయడం... ఓ ఇంటిపై ఏకంగా పెట్రోల్ పోసి మరీ నిప్పంటించి హత్య చేసేందుకు తెగబడటం సాధారణ రౌడీలు చేసే పని కాదు.
గంజాయి, కల్తీ మద్యం మత్తుతో విచక్షణ కోల్పోయి సైకోలుగా మారిన రౌడీమూకలే ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాయని పోలీసువర్గాలే చెబుతున్నాయి. అటువంటి పాశవిక హత్యాయత్నాన్ని కూడా కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ వెనుకేసుకువచ్చేట్టుగా....ఆ ఘటనను తక్కువ చేసి చూపేందుకు యత్నించడం విస్మయపరుస్తోందని వ్యాఖ్యానిస్తున్నాయి. అధికార టీడీపీ కూటమి హత్యా రాజకీయాలకు కొమ్ముకాయడమే తన ఏకైక కర్తవ్యంగా ఆయన భావిస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సర్కారు తీరు చూస్తుంటే రానున్న రోజుల్లో దాడులు, విధ్వంస కాండ, హత్యా రాజకీయాలతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు పూర్తిగా బరి తెగించినట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.